
జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. 100పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు, హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్‌ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది.
1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బాగూఖాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. గురెజ్ సెక్టార్‌లోని వివిధ ప్రాంతాల నుంచి 100కు పైగా చొరబాట్లకు సూత్రధారిగా వ్యవహరించాడని వెల్లడించాయి. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఇతడు సహాయం చేసేవాడని, అందులో ఎక్కువభాగం విజయవంతం అయ్యాయని పేర్కొన్నాయి.
అతడు హిజ్బుల్ కమాండర్‌గా ఉన్ననప్పటికీ.. ఈ టాలెంట్ వల్ల అన్ని ఉగ్రసంస్థలకు అతడు కీలకంగా మారాడు. కొన్నేళ్లుగా భద్రతా బలగాల కన్నుగప్పుతున్న అతడు.. తాజాగా మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఇక గురెజ్ సెక్టార్ నుంచి నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడుతోన్న ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది.