News

‘రామ సేతు’… కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు

285views

‘రామసేతు’ను జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించాలని కోరుతూ గతంలో కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్యస్వామి దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై స్పందన తెలియజేయాల్సిందిగా కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. రామసేతుకు సకాలంలో జాతీయ స్మారక చిహ్నం హోదా కల్పించాలని, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఆర్కియాలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాతో సర్వే చేయించాలని గతంలో సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా విచారణ చేపట్టారు. సుబ్రమణ్య స్వామి తరఫున సీనియర్‌ న్యాయవాది విభా మఖిజా వాదనలు వినిపించారు.

రామసేతును కాలుష్యం నుంచి కాపాడటంతో పాటు దాని పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని సుబ్రమణ్యస్వామి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ ప్రదేశం పలువురి నమ్మకాలతో ముడిపడి ఉందని తెలిపారు. మరోవైపు ‘సేతు సముద్రం షిప్‌ ఛానెల్‌ ప్రాజెక్టు’ కోసం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంపిక చేసుకోవాలని, తద్వారా రామసేతుకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని పేర్కొంటూ సుబ్రమణ్య స్వామి మరో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. ప్రస్తుతం అది సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టులో భాగంగా మన్నార్‌, పాక్‌ జలసంధిని కలుపుతూ 83 కి.మీ మేర పూడిక తీసి..ఛానెల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది కార్యరూపం దాల్చితే రామసేతుపై తీవ్ర ప్రభావం ఉంటుందన్న ఆరోపణలు ఉన్నాయి.

రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి సుప్రీంకోర్టులో గతంలోనే ఓ పిల్‌ దాఖలు చేశారు. స్మారక చిహ్నమా? కాదా అనే విషయాన్ని తేల్చకుండా కేంద్రం ఏళ్లతరబడి నాన్చుతోందని తన పిటిషన్‌లో ఆక్షేపించారు. దీనిని పరిశీలించిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ హిమాకోహ్లీ, జస్టిస్‌ జేబీ పార్దీవాలాల ధర్మాసనం.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.