News

బిహార్‌ జాబితాలో బంగ్లాదేశ్‌, అఫ్గాన్‌ ఓటర్లు..

235views

బీహార్ లో ఈసీ చేస్తున్న ప్రత్యేక సమగ్ర సవరణ సర్వేలో బిహార్‌ ఓటర్ల జాబితాలో అనేకమంది బంగ్లాదేశ్‌, నేపాల్‌, మయన్మార్‌, అఫ్గాన్‌ దేశస్థులు ఉన్నట్లు వెల్లడైంది. ఈ దేశాలకు చెందిన అనేకమంది ప్రస్తుతం రాష్ట్రంలో నివాసం ఉంటున్నారని అధికారులు తెలిపారు. వీరంతా ఆధార్‌ కార్డు, నివాస ధ్రువీకరణ పత్రాలు, రేషన్‌కార్డులు వంటి వాటిని అక్రమ మార్గాల ద్వారా పొందినట్లు తెలుస్తోంది.

ఇలా అవకతవకలకు పాల్పడిన దాదాపు 3 లక్షల మంది ఓటర్లకు ఈసీ నోటీసులు ఇచ్చింది. వీటిపై ఆగస్టు 1 నుంచి పరిశీలన మొదలైందని, ఇది సెప్టెంబరు నెలాఖరు వరకు కొనసాగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. ఓటర్ల జాబితాలో మార్పులు కోరుతూ గురువారం నాటికి 1,95,802 దరఖాస్తులు అందాయని ఈసీ వెల్లడించింది. వీటిలో 24,991 దరఖాస్తులకు సంబంధించిన సమస్యలను ఇప్పటికే పరిష్కరించినట్లు తెలిపింది. అఫ్గాన్‌కు చెందిన ఇమ్రానాఖానమ్‌ అలియాస్‌ ఇమ్రానా ఖాటూన్‌, ఫిర్దోషియా ఖానమ్‌ అనే ఇద్దరు మహిళలకు కూడా బిహార్‌లో ఓటరు కార్డులు జారీ అయినట్లు గుర్తించామని ఈసీ వెల్లడించింది. ఈవిషయంపై విచారణ జరపాలని కేంద్ర హోంశాఖ సైతం ఆదేశాలు జారీ చేసింది.

అనర్హులు, నకిలీ ఓటర్లతోపాటు విదేశీయులను ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ప్రారంభించినట్లు ఈసీ చెబుతోంది. ఇలాంటి సర్వేను చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటినుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. ఈ విషయంపై అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఏడీఆర్‌) అనే స్వచ్ఛందసంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా.. ఈసీ చర్యను ధర్మాసనం సమర్థించింది. ఇది రాజ్యాంగం ప్రకారం జరుగుతున్న ప్రక్రియేనని పేర్కొంది. అయితే, ఈసీ ఎంచుకున్న సమయాన్ని మాత్రం ప్రశ్నించింది.