
234views
వినాయక నవరాత్రులు వచ్చాయంటే విభిన్న రూపాల్లో కనిపించే గణపతులే కాదు.. మండపాల్లోని అలంకారాలు, సాంస్కృతిక కార్యక్రమాలూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. అలా మహారాష్ట్రలోని పుణెలో శ్రీమంత్ దగ్దుషేత్ హల్వాయి గణపతి మందిరంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుమారు 35 వేల మంది మహిళలు గణేశ్ అథర్వశీర్షను ఆలపించారు.
సుమారు 133 ఏళ్లుగా ఈ ఆలయంలో గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. గడిచిన 40 ఏళ్లుగా అథర్వశీర్ష పారాయణం నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా అర్ధరాత్రి నుంచే మహిళా భక్తులు మండపానికి సంప్రదాయ వస్త్రధారణలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భార్య, ఎంపీ సునేత్ర పవార్ పాల్గొన్నారు. భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది.




