News

36 పాక్ వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్

177views

ధర్మవరంలో పట్టుబడ్డ కొత్వాల్ నూర్ మహ్మద్ కు ఉన్న ఉగ్రలింకులను కని పెట్టేందుకు పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. పాకిస్థాన్ కు చెందిన 36 వాట్సాప్ గ్రూపుల్లో అతడు యాక్టివ్ గా ఉన్నట్లు గుర్తించారు. ఆ గ్రూపులు ఏంటి? వాటిలో కార్యకలాపాలు ఏంటి? ఏమి సమాచారాన్ని ఆ గ్రూపుల్లో పంచుకున్నాడనేది విశ్లేషిస్తున్నారు. దీని కోసం అతని మొబైల్ ఫోన్ ను ఫోరెన్సిక్ ల్యాబు కు పంపారు. కాగా, పాకిస్థాన్ కు చెందిన జైషే మహమ్మద్ సహా ఆరు ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపుల్లో నూర్ మహమ్మద్ చురుగ్గా ఉన్నట్లు ఇప్ప టికే తేలింది. మరో 30 పాక్ వాట్సాప్ గ్రూపుల్లోనూ ఉన్నాడని తాజాగా వెల్లడైంది. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు నూర్ ముహమ్మద్ ను కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించారు. కడప సెంట్రల్ జైల్లో ఉన్న అతన్ని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ధర్మవరం కోర్టులో పోలీసులు మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కాగా, నూర్ ముహమ్మద్ ను అదుపులోకి తీసుకున్న సమయంలో ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉగ్ర లింకులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదే శ్లోనూ ఉన్నట్లు తేలింది. ఆ రాష్ట్రాలకు చెందిన ఇద్దరితో సంబంధాలు నెరిపి నట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రత్యేక పోలీసులు బృందాలు ఆ రాష్ట్రాలకు వెళ్లినట్లు తెలిసింది.

పరారీలో ప్రియురాలు
నూర్ మహమ్మద్ అరెస్టు తరువాత అతడి ప్రియురాలు, సన్నిహితులు కొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నూర్ మహమ్మద్ ఎవరెవరు సన్నిహితంగా వ్యవహరించారు, వారు ఎక్కడెక్కడ దాక్కున్నారో గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. నూర్ ఫోన్ కాల్స్ ఆధారంగా వీరిని గుర్తిస్తున్నారు. దీంతో స్థానికంగా అతనితో కలిసి తిరిగినవారిలో గుబులు మొదలైంది.