
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి వ్యహహారంపై బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులపై దాడి చేసిన రాజశేఖర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారని.. ఈ విషయం చాలా మంచిదేనని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులపైన దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయనే మంచి సందేశాన్ని పవన్ కల్యాణ్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు.
శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని కాపాడే బాధ్యత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పైన కూడా ఉంటుందని సూచించారు. శ్రీశైలం జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి యావత్ భారతదేశం నుంచి భక్తులు చాలామంది వస్తారని.. కానీ దురదృష్టం ఏంటంటే గతంలో రాజకీయ పార్టీల నేతలు కొన్ని పాపాలు అక్కడ చేశారని గుర్తుచేశారు. శ్రీశైలం చాలా పెద్ద పవిత్ర స్థలం, కానీ ఈ పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడానికి కుట్రలు చాలా కాలంగా జరుగుతున్నాయని ఆరోపించారు. గత ప్రభుత్వాలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి ముస్లింలను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపరిచాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. మునుపటి పార్టీలు తమ ఓటు బ్యాంకును పెంచుకోవడానికి క్రైస్తవ కుటుంబాలను శ్రీశైలం పవిత్ర ప్రాంతంలో స్థిరపరిచాయని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజాసింగ్.
శ్రీశైలం పవిత్ర ప్రాంతంలోని దాదాపు అన్ని దుకాణాలను ముస్లింలు, క్రైస్తవులు ఆక్రమించారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి ఇక్కడి విషయం తెలుసా లేదా? వారికి తెలిస్తే, మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. మన పవిత్ర స్థలాన్ని అపవిత్రం చేయడానికి అలాంటి వ్యక్తులు శ్రీశైలం పవిత్ర స్థలాన్ని పాములా ఎందుకు ఆక్రమించారు? వారిని అక్కడి నుంచి ఎందుకు తొలగించడం లేదని ఇక్కడ భారతదేశానికి చెందిన ఒక శివభక్తుడు ఈ ప్రశ్న అడుగుతున్నారని తెలిపారు. ఈ సమస్యను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ పరిష్కరించాలని అభ్యర్థిస్తున్నానని అన్నారు. దయచేసి ఇక్కడ కూడా అదే తప్పు చేయొద్దని సూచించారు. శ్రీశైలం పవిత్ర స్థలాన్ని ఆక్రమించిన వారందరినీ, ఇతర మతాల వారిని వెంటనే సున్నిపేట ప్రాంతానికి బదిలీ చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు.





