
పాకిస్తాన్ ప్రాయోజిత ఇస్లామిక్ ఉగ్రవాదుల మారణ హోమంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు లెఫ్టినెంట్ గవర్నర్ సారథ్యంలోని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం అండగా నిలబడింది. పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 158 మంది కుటుంబాలకు చెందిన వారికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.
దశాబ్దాలుగా వుండిపోయిన గాయాలు మానిపోతున్నాయని, న్యాయం అందుతోందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. ఇన్ని సంవత్సరాల పాటు నిశ్శబ్దంగా మనో వేదనను భరించారని, ఇప్పుడు ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా అమరులందరికీ నివాళులు అర్పించారు. గత మూడు దశాబ్దాలుగా పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాదం ప్రజలు అనేక బాధలు పడ్డారని, అయినా… అత్యంత ధైర్య సాహసాలతో అమరుల కుటుంబాలు తమ జీవితాలను కొనసాగిస్తున్నాయని ప్రశంసించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఓ రెడ్ లైన్ గీసిందని, ఉగ్రవాదులకు, వారి ప్రేరేపితులకు కూడా శిక్షపడుతుందని ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్, అమాయకుల రక్తాన్ని చిందిస్తోందని మండిపడ్డారు.
అయితే ఆర్థిక పరిహారం, ఉద్యోగం అనేవి కుటుంబంలో ఏర్పడ్డ శూన్యతను పూరించలేదని, అయితే.. గౌరవంగా బతికేలా మాత్రం చేస్తుందని మనోజ్ సిన్హా అన్నారు. ఆర్టికల్ 370 రద్దు అందరికీ సమానత్వం, న్యాయం మరియు అవకాశాలను ఇచ్చే కొత్త జమ్మూ కశ్మీర్ ఆవిర్భవించిందన్నారు. గతంలో ఉగ్రవాద సానుభూతిపరులకు మాత్రమే ఉద్యోగాలు వచ్చేవని, నేడు మాత్రం అమరులైన కుటుంబాలకు వెళ్తున్నాయని మనోజ్ సిన్హా అన్నారు.
చాలా కాలం వేచి చూసినా… న్యాయం దక్కింది : ముదాసిర్ మజీద్
ఎల్జీ మనోజ్ సిన్హా చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందుకోవడం ఆనందంగా వుందని ముదాసిర్ మజీద్ అనే వ్యక్తి పేర్కొన్నారు. 2004 లో ఇతడ్ని బారాముల్లాలో ఇస్లామిక్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. నేటి వరకు ఆ ప్రభుత్వానికి భద్రతా సంబంధిత వ్యయ పథకం కింద కొద్దిపాటి ఎక్స్ గ్రేషియా మాత్రమే వస్తోంది.
సుహైల్ మజీద్..
1994 లో సుహైల్ తండ్రి అబ్దుల్ మజీద్ ను కోల్పోయాడు. దాదాపు 31 సంవత్సరాల పాటు ఈ కుటుంబం చాలా ఇబ్బందులు పడింది. ఇప్పుడు ఎల్జీ మనోజ్ సిన్హా చేతుల మీదుగా నియామక పత్రాలను అందుకోవడం సంతోషంగా వుందని సుహైల్ మజీద్ హర్షం వ్యక్తం చేశారు.





