
హిందూ మతం వైవిధ్యాన్ని అంగీకరించమనే బోధిస్తుందని, అలాగే మానవునికి వుండే ధర్మాన్ని అనుసరించమని చెబుతుందని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. అందరి మార్గాలు వేర్వేరుగా వున్నా.. గమ్యం మాత్రం ఒక్కటేనని అన్నారు. ఇతరు మార్గాన్ని కానీ, పంథాను గానీ మార్చడానికి ప్రయత్నాలు చేయవద్దని, అలాగే వారి పంథాపై వివాదాన్ని కూడా లేపకూడాని సూచించారు. నాగపూర్ లో ధర్మ జాగరణ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఇందులో మోహన్ భాగవత్ పాల్గొన్నారు.
ధర్మంపై స్పృహ వున్నప్పుడే ధర్మాన్ని ఆచరించే సమూహం అస్తిత్వంలో వుంటుందని, అలాగే కేవలం గ్రంథాలకే పరిమితం కాకుండా వుంటుందన్నారు. అయితే ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఓ ఆదర్శాన్ని రూపొందించాలని, ఇది భారత దేశ బాధ్యత అని అన్నారు.
సనాతన ధర్మం ఆత్మీయతను, వైవిధ్యాన్ని పూర్తిగా అంగీకరించాలనే బోధిస్తుందని, భారత్ లో వైవిధ్యం వున్నా..చివరికి అందరూ ఒక్కటేనని, అన్ని వైవిధ్యాలను అంగీకరించడమే నిజమైన మతమని అన్నారు. ధర్మానికి సంబంధించిన కార్యం కేవలం ఈశ్వరుడిది మాత్రమే కాదని, ప్రజలందరిదీ అని అన్నారు. అందుకే ధర్మం సరిగ్గా ఆచరిస్తే ఆ సమాజం సమతౌల్యంతో, శాంతితో తులతూగుతుందని అన్నారు.
ధర్మానికి సంబంధించిన ఏ పనైనా అది అత్యంత పవిత్రమైనదేనని, మనం దేనినైతే ధర్మంగా పిలుస్తున్నామో అదే సత్యమని, మన దేశంలో వైవిధ్యం కనిపిస్తుంది కానీ, అది ఐకమత్యం యొక్క ఆవిష్కరణ అని వివరించారు. ధర్మాన్ని ఆచరించడం ద్వారా సత్యం, తపస్సు, కరుణ జాగృతం అవుతాయని, అందుకే ధర్మాచరణ కోసం నిత్యం ప్రయత్నం చేయాలని సూచించారు.
ధర్మం అంటే కర్తవ్యమన్నదే అభిప్రాయమని, దీని నుంచే రాజధర్మం, ప్రజాధర్మం, పితృధర్మం వంటి భావనలు పుట్టుకొచ్చాయని తెలిపారు. అయితే.. చాలా మంది జీవితాల్లో క్లిష్ట పరిస్థితులు తలెత్తుతాయని, ఆ సమయంలో ధైర్యాన్ని కోల్పోతారని, దీంతో అసలైన మార్గాన్ని విడిచిపెట్టేస్తారన్నారు. కానీ ఉత్తములు, పురుషార్థులు మాత్రం అలసిపోకుండా, ఆగిపోకుండా తమ శక్తియుక్తులను పూర్తిగా వినియోగించి, ధర్మాన్ని పాలిస్తారన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితంలో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు, కానీ అతను తన బలం మరియు జ్ఞానంతో దానిని అధిగమించి, ఓ మార్గాన్ని వేశారని అన్నారు. ఎవరికైనా తమ ధర్మం పట్ల బలమైన నమ్మకం, భక్తి వుండాలని, చాలా మంది ధర్మం కోసం తమ ప్రాణాలనే ఇచ్చేశారని గుర్తు చేశారు.విరోధులు చిత్ర హింసలు పెట్టినా, భరించారే కానీ ధర్మాన్ని మాత్రం విడిచిపెట్టలేదని, అలాంటి వారే మనకు ఆదర్శప్రాయులని మోహన్ భాగవత్ అన్నారు.





