ArticlesNews

‘‌విశ్వమాత’ విశిష్ట వ్రతం

239views

( శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం  – వరలక్ష్మి వ్రతం ) 

దారిద్య్రం నుంచి ధనం వైపునకు, అజ్ఞాన తిమిరం నుంచి సుజ్ఞాన దిశగా నడిపే దివ్య తేజోమూర్తి శ్రీమహాలక్ష్మిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. ధనం అంటే కేవలం స్థిరచరాస్తులే కాదు. ఆరోగ్యం, ఆయుష్షు, విద్యా, వివేకాలు, కీర్తిప్రతిష్ఠలు, అభయం, ధైర్యం, స్థయిర్యం, విజయం, వీర్యం, శౌర్యం, సాహసం, ధనధాన్యాలు, వస్తువాహనాలు, పుత్ర పౌత్రాదులు… ఇలా అన్నీ సంపదే. వీటన్నిటికి అధిదేవత శ్రీ మహాలక్ష్మి. మహిళలు తమ సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం వరలక్ష్మిదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. క్షీరసాగర మథనవేళ ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు స్వీకరించి ‘నీలకంఠుడు’ అయ్యిందీ ఈ మాసంలోనే కనుక, ఈ నెలలోని సోమవారాల్లో ఆయనకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారు.

లక్ష్మీనారాయణులది అవిభాజ్య బంధమని, వారిని అర్చించడం వల్ల ముక్తి లభిస్తుందని పెద్దల మాట. విష్ణు సహస్రపారాయణానికి ముందు మహాలక్ష్మిని స్తుతించినట్లే, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేందుకు మొదట శ్రీహరిని ఆరాధించాలని పూర్వాచార్యులు అనుగ్రహించారు. చపలచిత్తగా పేరున్న అమ్మవారు శ్రీహరిని మాత్రం వీడి ఉండరు. అంటే లక్ష్మీకటాక్షానికి విష్ణ్వారాధన ప్రధానంగా భావిస్తారు. లక్ష్మీదేవి వైకుంఠంలో ‘మోక్షలక్ష్మి’గా ఉంటుందని, చతుర్విధ పురుషార్థాలకు ఆమె చతుర్భుజాలు ప్రతీకలని చెబుతారు. ఆమెను అర్చించే ప్రధాన పర్వదినమే వరలక్ష్మి వ్రతం. ‘లోకంలో పరమ పావనమైన వ్రతం ఏది?’ అన్న జగన్మాత పార్వతీదేవికి మహాదేవుడు దీనిని ఉపదేశించారని, ఆమె మొట్టమొదటిసారిగా వరలక్ష్మి వ్రతం ఆచరించారని భవిష్యోత్తర పురాణం పేర్కొంటోంది. ‘వరం’ అంటే శ్రేష్ఠమైన అని, ‘లక్ష్మి’ అంటే సకల శుభలక్షణాలు గల దేవత. ఆమె కరుణా కటాక్షాలతోనే సకల సంపదలు, శుభాలు కలుగుతాయని మహిళాలోక విశ్వాసం. అందుకే వర్ణ,వర్గ,భేదాలకు అతీతంగా వరలక్ష్మి వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించడం సంప్రదాయకంగా వస్తోంది. ఈ వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరించాలని ‘వ్రతరత్నాకరం’ పేర్కొంటోంది. అవకాశం లేనివారు ఈ మాసంలోనే ఇతర శుక్రవారం కూడా వ్రతం ఆచరించవచ్చని పెద్దలు ప్రత్యా మ్నాయం సూచించారు. అమృతం కోసం దేవ దానవులు పాలకడలిని చిలికినప్పుడు శుక్రవారం నాడు అవతరించిన అమ్మవారిని విష్ణుపురాణం ‘విశ్వమాత’గా అభివర్ణించింది. అందుకే లక్ష్మీదేవికి శుక్రవారం ప్రీతికరమైనదిగా చెబుతారు. భృగుప్రజాపతి తపస్సుకు మెచ్చి లక్ష్మీదేవి ఆయన తనయగా అవతరించినందున, ఆయన అధిపతిగా గల శుక్రవారం (భృగు వాసర) లక్ష్మీపూజకు శ్రేష్ఠమని శాస్త్రం. సౌమాంగల్యం, సత్సంతానాభివృద్ధి కోసం వర•లక్ష్మిని ఆరాధిస్తారు. వైవాహిక జీవితం సవ్యంగా సాగాలని వివాహితలు, ఉత్తమ జీవిత భాగస్వాముల కోసం అవివాహితలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఆషాడంలో పుట్టినింట ఉండే నవ వధువులు శ్రావణం ప్రవేశించాక, మొదటి మంగళవారం నోము జరుపుకుని మెట్టినింటికి చేరి వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఆచారంగా వస్తోంది. వివాహితలు శ్రావణంలోని శుక్రవారాలు లక్ష్మీపూజ, పెళ్లికాని యువతులు మంగళవారాలు మంగళగౌరి వ్రతం ఆచరించడం సంప్రదాయం.

ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ప్రత్యేక నియమాలంటూ లేవని, నిశ్చలమైన భక్తితో దేవిని అర్చించి, వ్రత కథ చదివితే చాలని అంటారు. అమ్మవారి ధ్యాన, ఆవాహనలతో ప్రారంభమయ్యే వ్రతం షోడశోపచార•, అంగపూజలు, అష్టోత్తరశత (సహస్ర) నామాలతో కొనసాగి, వ్రతకథతో పరిసమాప్తమవుతుంది. వ్రతకర్తలు ముత్తయి దువలకు…

‘ఇందిరా ప్రతిగృహ్ణాతి ఇందిరా వై దదాతి చ!
ఇందిరా తారికా ద్వాభ్యామ్‌ ఇం‌దిరాయై నమో నమః’ (తోటి ముత్తయిదువా! ఈ వ్రత పరిసమాప్తితో మనిద్దరం లక్ష్ములమే. మనందరిలోనూ,మన చేతి తోరాల్లోనూ లక్ష్మి ఉందని గ్రహించాను. లక్ష్మీ స్వరూపిణీవై దీనిని స్వీకరించు) అని వాయనం ఇస్తారు. చారుమతీదేవి అనే భక్తురాలు ఈ వ్రతాన్ని ఆచరించి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు పొందిందని పురాణాలు పేర్కొంటున్నాయి. దాని స్ఫూర్తితోనే ఈ వ్రతవిధానం అచరణలోకి వచ్చింది.

పసుపు, కుంకుమ, పూలు, సుగంధ•ద్రవ్యాలు, ఆవునేతితో వెలిగే జ్యోతి రూపంలోనూ గౌరీదేవి కొలువై ఉంటుందని, అందుకే ఇంటికి వచ్చిన ముత్తయిదువులకు మంగళకరమైన వస్తువులు ఇచ్చి ఆశీర్వాదం పొందుతుంటారు. ఈ వేడుకల వల్ల ఆధ్యాత్మికతే కాక పాటు సామాజిక బంధాలు పటిష్టమవుతాయి. పేరంటం వేడుకలో ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు స్నేహభావం, సహకార భావం పెంపొందే అవకాశం ఉంటుంది.

ఏనుగులతో అభిషేకం అందుకుంటున్న శ్రీమహాక్ష్మిని ఉదయం నిద్రలేవగానే స్మరించడం వల్ల ఆరోగ్యానికి, సంపదకు లోటు ఉండదని శంకర భ•గవత్పాదులు అనుగ్రహభాషణ చేశారు. అష్టలక్ష్ములుగా భక్తజనావళిని అనుగ్రహించే శ్రీసతి గురించి …

‘కమల నయన! నీవు కచోటు సరసంబు
నీవు లేని చోటు నీరసంబు
కంబుకఠి! నీవు కలవాడు కలవాడు
లేనివాడు నీవు లేని వాడు’

అని కవిసార్వభౌముడు శ్రీనాథ మహాకవి చాటువులో చాటించాడు. ఇందుకు ప్రచారంలో ఉన్న పురాణగాథ కూడా అదే చెబుతుంది. ఒకసారి ఇంద్రుడు అహంకారం కొద్దీ విష్ణు ప్రసాదాన్ని ధిక్కరించి, అటు తరువాత పశ్చాత్తాపం చెందాడు. ‘దైవారాధన, ప్రేమానురాగాలు, సచాచారం, ధర్మనిష్ఠ, విష్ణు-గోసేవ, శుచీశుభ్రత, సత్య సంభాషణంగల లోగిళ్లు లక్ష్మీనిలయాలు. అందుకు వి

రుద్ధంగా వ్యవహరించడమే కాక, సూర్యోదయ, సూర్యా స్తమయాల్లో నిద్రించే చోట లక్ష్మి క్షణమైనా నిలవదు’ అని శ్రీహరి వివరించాడట. ఇది పురాణ గాథ అయినా, మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే హితోక్తులుగానే భావించాలి.