ArticlesNews

కాశీలో కనువిందు చేస్తున్న ఆకాశదీపాలు..

9views

కార్తీకమాసం వచ్చిందంటే చాలు.. కాశీ క్షేత్రం ఆధ్యాత్మిక శోభతో వెలిగిపోతుంది. సాయంసంధ్య వేళ గంగానది తీరంలోని పంచగంగ ఘాట్‌లో నింగిని తాకేలా వెలిగే ఆకాశదీపాలు భక్తులకు కనులవిందు చేస్తాయి. ఎత్తైన వెదురు కర్రలపై ఏర్పాటు చేసిన వెదురు బుట్టల్లో ఎర్రటి కాంతులు వెదజల్లే దీపాలు కాశీ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

వారణాసిలోని పంచగంగ ఘాట్‌లో కొన్ని శతాబ్దాలుగా ఈ విశిష్ట సంప్రదాయం కొనసాగుతోంది. కార్తీకమాసంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటారు. తమ పూర్వీకులకు నివాళులర్పిస్తూ భక్తిశ్రద్ధలతో ఆకాశదీపాలను వెలిగిస్తారు.

ఈ సంప్రదాయంలో భాగంగా నువ్వుల నూనెతో మట్టి ప్రమిదల్లో దీపాలను వెలిగించి, వాటిని వెదురు బుట్టల్లో ఉంచుతారు. అనంతరం తాళ్ల సహాయంతో ఆ బుట్టలను పొడవాటి వెదురు కర్రల పైభాగానికి చేరుస్తారు. అలా గంగానది తీరంలో నింగివైపు వెలుగులు విరజిమ్మే ఆకాశదీపాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పవిత్రంగా మారుస్తాయి.

ఆకాశదీపాలు వెలిగించడం ద్వారా పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుందని, వారు పరలోక ప్రయాణంలో వెలుగును పొందుతారని భక్తుల విశ్వాసం. పూర్వీకులకు మార్గదర్శకంగా ఈ దీపాలు ప్రకాశిస్తాయని స్థానిక మహంతు జితేంద్ర మోహన్‌పురి వివరించారు.

తెల్లవారుజామున పవిత్ర గంగానదిలో స్నానమాచరించి, సాయంత్రం వేళ ఆకాశదీపాలను వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారమని బనారస్ హిందూ విశ్వవిద్యాలయం జ్యోతిష్య విభాగం ప్రొఫెసర్ వినయ్ పాండే తెలిపారు.

కార్తీకమాసంలో దీపారాధనకు ఉన్న విశిష్టతను, పూర్వీకుల పట్ల భారతీయులకున్న గౌరవభావాన్ని చాటిచెప్పే ఈ ఆకాశదీపాల సంప్రదాయం భారతీయ సనాతన సంస్కృతిలోని ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది.