
కొబ్బరి బొండాల మాటున పశువుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. మరిపెడ పోలీసులు తనిఖీల్లో బయటపడింది. నంబర్ ప్లేట్ లేని టాటా ట్రాలీలో కొబ్బరి బొండాల కింద ఎనిమిది పశువులను కాళ్లు, మెడలకు తాళ్లతో కట్టేసి కదలలేని స్థితిలో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. ఈ అమానుష ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని చోటు చేసుకుంది
. ఎస్ఐ గండ్రాతి సతీశ్ కథనం ప్రకారం.. మరిపెడ పోలీస్స్టేషన్ కానిస్టేబుళ్లు నరేష్, జి.శ్రీను రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన టాటా ట్రాలీని ఆపి తనిఖీ చేశారు. కొబ్బరి బొండాల మాటను పరిశీలించగా ఆరు ఆవులు, రెండు కోడెగిత్తలు కలిపి మొత్తం ఎనిమిది పశువులు కనిపించాయి. వాటిని కాళ్లు, మెడలకు తాళ్లతో బంధించి అనుమానుషంగా తరలిస్తున్నట్టు గుర్తించారు.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి ప్రాంతానికి చెందిన గొర్ల శివ, యలమచిలీ శివ, బంగారి లచ్చన్న అదే ప్రాంతంలోని ఈ పశువులను కొబ్బరి బొండాల మాటున హైదరాబాద్లోని కబేళాలకు తరలిస్తున్నారు. బందీగా ఉన్న అక్రమ రవాణాదారుల చెర నుంచి ఎనిమిది పశువుల నుంచి విడిపించిన పోలీసులు పశువైద్యాధికారులతో మూగజీవాలకు చికిత్స అందించారు. పశువుల అక్రమ రవాణాకు ఉపయోగించిన టాటా ట్రాలీని సీజ్ చేసి ముగ్గురు నిందితులపై పశువుల అక్రమ రవాణా, జంతువుల పట్ల కూరత్వానికి సంబంధించిన చట్టాల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.





