
దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించడం, టపాసులు కాల్చడం మాత్రమే కాదు. మనిషిలోని అజ్ఞానం, అహంకారం, అసూయ, ద్వేషం వంటి చీకట్లను తొలగించుకుని జ్ఞానం, ప్రేమ, ధర్మం అనే వెలుగుల వైపు ప్రయాణించడమే ఈ పండుగ అసలైన సందేశం.
మన సంప్రదాయంలో దీపానికి పరబ్రహ్మ స్వరూపంగా ప్రత్యేక స్థానం ఉంది.
దీపం జ్యోతి పరబ్రహ్మ
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
గృహే దీపం నమోస్తుతే
అంటే దీపజ్యోతి పరబ్రహ్మ స్వరూపం. అది సమస్త చీకట్లను తొలగిస్తుంది. శుభకార్యాలన్నింటికీ దీపం శుభసూచకంగా నిలుస్తుంది.
దీపావళి ఆచారాలు.. పండుగలో ప్రతి రోజుకూ ప్రత్యేకత!
దీపావళి పండుగ సందర్భంగా ధనత్రయోదశి, నరక చతుర్దశి, అమావాస్య లక్ష్మీపూజ వంటి ఆచారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.
– ధనత్రయోదశి: సంపద, ఆరోగ్యం, శుభం కోసం దీపాలు వెలిగించి ధన్వంతరి, లక్ష్మీదేవిని ఆరాధిస్తారు.
– నరక చతుర్దశి: తెల్లవారుజామున అభ్యంగన స్నానం చేయడం సంప్రదాయం. నరకభయం తొలగాలని భవిష్య పురాణం ఈ స్నాన ప్రాశస్త్యాన్ని వివరిస్తుంది.
– దీపావళి అమావాస్య: సాయంత్రం ఇళ్లలో దీపాలు వెలిగించి మహాలక్ష్మిని పూజిస్తారు. వ్యాపారులు కొత్త లెక్కల పుస్తకాలను ప్రారంభించే సంప్రదాయం కూడా ఉంది.
పెద్దలను స్మరించుకుంటూ దీపాలు వెలిగించాలి!
మన కుటుంబాలు ఈ స్థాయికి చేరుకోవడానికి తాతముత్తాతలు, పెద్దలు, శ్రేయోభిలాషులు ఎంతో కృషి చేసి ఉంటారు. వారి త్యాగాలను, సేవలను గుర్తు చేసుకోవడం మన బాధ్యత. దీపావళి సందర్భంగా వారిని స్మరించుకుంటూ దీపాలు వెలిగించడం, పేదలకు దానధర్మాలు చేయడం, అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం ద్వారా పండుగకు మరింత అర్థాన్ని తీసుకురావచ్చు.
పిల్లలకు పండుగ ప్రాశస్త్యం తెలియజేయాలి!
దీపావళి రోజున పిల్లలకు తలంటు పోసి, కొత్త దుస్తులు ధరింపజేసి, పిండివంటలు పెట్టి, బాణాసంచా కాల్చించడం ప్రతి ఇంట్లో కనిపించే ఆనందకరమైన దృశ్యం.
అయితే పిల్లలకు దీపావళి ఎందుకు జరుపుకుంటామో కూడా తల్లిదండ్రులు వివరించాలి. శ్రీకృష్ణుడి నరకాసుర వధ, శ్రీరాముడి విజయగాథ, బలిచక్రవర్తి కథ, లక్ష్మీదేవి ఆరాధన వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని తెలియజేయాలి.
వెలుగులు పంచుదాం.. ఆనందాలు పంచుకుందాం!
దీపావళి పండుగ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఒక్కటే. మన ఇంట్లో మాత్రమే కాకుండా చుట్టుపక్కల వారి జీవితాల్లోనూ వెలుగులు నింపాలి. ఇరుగు పొరుగు వారితో సంతోషాలను పంచుకోవాలి. పేదలకు సహాయం చేయాలి. దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి. పర్యావరణానికి హాని కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పండుగను జరుపుకోవాలి.
అజ్ఞానం నుంచి జ్ఞానం వైపు.. చీకటి నుంచి వెలుగు వైపు.. అసత్యం నుంచి సత్యం వైపు మనిషిని నడిపించే ఆధ్యాత్మిక సందేశమే దీపావళి.




