
స్నేహితుల దినోత్సవం సందర్భంగా గురుదేవ్ శ్రీశ్రీ రవి శంకర్ సందేశం ఇచ్చారు. మంచివాడు, చెడ్డవాడు అని మనుషులను విభజించకూడదని సూచించారు. ‘‘ఒక విషయాన్ని గుర్తుంచుకోండి.. మీ సమయం మంచిదైతే, మీ శత్రువు కూడా మీకు సహాయం చేయగలడు. మీ సమయం చెడుగా ఉంటే మీ అత్యుత్తమ మిత్రుడు కూడా శత్రువులా ప్రవర్తించగలడు. కాలం మన ఆలోచనని, ప్రవర్తనను మారుస్తుంది. ఒకసారి మిమ్మల్ని మీరు గమనించుకోండి. ఐదేళ్ల క్రితం మీరు ఎలా ఉండేవారో ఇప్పుడలా లేరు. ఇతరుల మాటలకు, చర్యలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే.. మనం మన ఆనందాన్ని కోల్పోతాం. ఎందుకంటే ఇవన్నీ క్షణంలో మారిపోవచ్చు.
ఒక్కోసారి వ్యక్తులు మనస్ఫూర్తిగా కొన్ని మాటలు అనరు. ఉదాహరణకు.. ఒక తల్లి కోపం వచ్చినప్పుడు బిడ్డను పో అంటుంది. ఆ బిడ్డ నిజంగా ఇల్లు విడిచిపోతే తల్లి పరిస్థితి ఏమౌతుందో ఊహించుకోండి. వ్యక్తులను స్నేహితులు లేదా శత్రువులుగా ముద్ర వేయడం కంటే సానుకూల వైబ్రేషన్లను పెంపొందించుకోవడం తెలివైన పని. మీ స్వభావాన్ని స్నేహపూర్వకంగా మార్చుకోండి. మీరు ఎల్లప్పుడూ చిరాకుపడే వ్యక్తితో కలిసి పనిచేయాలనుకుంటున్నారా? లేదా ఎల్లప్పుడూ అహంకారంగా, చెడ్డగా ఉండే వ్యక్తితో ఉండాలనుకుంటున్నారా? ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీలో ఈ లక్షణాలు ఉన్నాయా? మీరు చిరాకు పడతారా..? మీరు అహంకారంగా ఉన్నారా? ఇతరుల పట్ల అసహనంగా ఉన్నారా? ఇతరులు ఏం చేస్తున్నారో, ఏం చెబుతున్నారో గమనించడం కంటే మనల్ని మనం గమనించుకోవడం మంచిది.
మనం మన మాటల ద్వారా కంటే మన వైబ్రేషన్ల ద్వారానే చాలా ఎక్కువ వ్యక్తం చేస్తాం. నేను ఇక్కడ కూర్చుని రెండు గంటల పాటు ప్రేమ గురించి ఉపన్యాసం ఇవ్వగలను. నేను శాంతి గురించి గట్టిగా చెప్పగలను. నేను చెప్పేదానికన్నా.. నా వ్యక్తిత్వమే మీపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ప్రేమ గురించి రెండు గంటలు మాట్లాడేదానికన్నా.. మీరు మీ కుక్కపిల్లతో గడిపే 30 సెకన్ల సమయం ఎంతో అపురూపంగా అనిపిస్తుంది. చిన్న పిల్లల వైపు చూసినప్పుడు వారి ప్రేమ వెంటనే హృదయాన్ని తాకుతుంది. అలాంటి భావాలను మాటల్లో వ్యక్తపరచలేం. వాటి అనుభూతి మాత్రమే మనకు తెలుస్తుంది. అందుకే మన ఉనికి, మన వైబ్రేషన్లు మన మాటలకన్నా ఎంతో ప్రభావితమైనవి.
నిజమైన సంభాషణ వైబ్రేషన్ల ద్వారా జరుగుతుంది. మనం మన ఆలోచనలను, భావాలను మాటల ద్వారా కాకుండా మన ఉనికి ద్వారా ఎక్కువగా వ్యక్తపరుస్తాం. అయినప్పటికీ ఎవరో చెప్పిన మాటలను పట్టుకుని మనం చాలా స్నేహాలను పాడు చేసుకుంటాం. ఇలా మీ జీవితంలో కూడా జరిగిందా? జీవితాన్ని విశాల దృక్పథంతో చూడండి. ఒక సంఘటనకు అతీతంగా జ్ఞానం ఉంటుంది. ఒక వస్తువుకు అతీతంగా అనంతం ఉంటుంది. ఒక వ్యక్తికి అతీతంగా ప్రేమ ఉంటుంది. పదాలకు అతీతంగా ఏం ఉందో మనం చూడం. పదాలపైనే ఆధారపడే స్నేహం ఎప్పటికీ గాఢంగా ఉండదు.
మన వైబ్రేషన్లని ఎలా మెరుగుపరచుకోవాలో మనకు ఎవరు నేర్పించలేదు. ఇటువంటి విషయాలలో ఆధ్యాత్మికత కీలక పాత్ర పోషిస్తుంది. ధ్యానం, సేవ, ప్రాణాయామం వంటి ఆధ్యాత్మిక అభ్యాసాలు.. మీ వైబ్రేషన్లని మరింత సానుకూలంగా మారుస్తాయి. ద్వేషం నుంచి ప్రేమకు, నిరాశ నుంచి ఆత్మవిశ్వాసం, ఆశ వైపు మిమ్మల్ని నడిపిస్తాయి. మీ వైబ్రేషన్లు సానుకూలంగా ఉన్నప్పుడు, స్నేహం అప్రయత్నంగా వికసిస్తుంది’’ అని గురుదేవ్ శ్రీశ్రీ రవి శంకర్ తన సందేశంలో పేర్కొన్నారు.





