News

తిరుమల ఆలయ వెండివాకిలి వద్ద చోరీలు.. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్టు

254views

తిరుమలలో మహిళా భక్తులే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను తిరుమల పోలీసులు అరెస్టు చేశారు. శ్రీవారి ఆలయ వెండివాకిలి, పీఎసీ-3 వద్ద పలువురు మహిళా భక్తుల నుంచి మంగళ సూత్రాలు కాజేశారు. పోలీసులు రంగంలోకి దిగి.. రెండు కేసుల్లో మహారాష్ట్రకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

క్యూలైన్లలో భక్తులే టార్గెట్‌గా చోరీలకు పాల్పడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చి క్యూలైన్లలో వేచివున్న భక్తుల మెడల్లోని గొలుసులు, సెల్ ఫోన్లను కొంతకాలంగా ఆరుగురు వ్యక్తుల ముఠా చోరీలకు పాల్పడుతోంది. భక్తుల ఇచ్చిన ఫిర్యాదుల మేరకు క్యూలైన్లలోని సీసీ టీవీ ఫుటేజులను పరిశీలించారు. భక్తుల బంగారు చైన్లు చోరీ చేస్తున్న అంతరాష్ట్ర దొంగలను గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. 100 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తిరుమల సన్నిధిలో భక్తుల భద్రతే తమకు ముఖ్యమని, చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.