News

ఆస్ట్రేలియాలో హిందూ ఆలయంపై జాత్యహంకార రాతలు

250views

ఆస్ట్రేలియాలో జాత్యహంకార ఘటన చోటుచేసుకుంది. మెల్‌బోర్న్‌లోని బోరోనియాలో ఓ హిందూ ఆలయంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేష పూరిత వ్యాఖ్యలు రాశారు.

స్వామి నారాయణ్‌ ఆలయం వద్ద ఈనెల 21న ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆలయం గోడలపై హిట్లర్‌ చిత్రాన్ని ఉంచి, దానిపై ‘గో హోమ్‌ బ్రౌన్‌..’ అని రాశారు. ఇక, ఇదే ప్రాంతంలోని ఆసియన్‌లు నడిపే హోటళ్లపై కూడా ఇలాంటి విద్వేషపూరిత రాతలే రాసినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. హిందూ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆస్ట్రేలియా అధ్యక్షుడు మకరంద్‌ భగవత్‌ ఈ ఘటనను ధ్రువీకరిస్తూ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఇది తమను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటివి భక్తులు, స్వచ్ఛంద సేవకుల హృదయాలను ఎంతో కలచివేస్తాయన్నారు. దేవాలయాలు శాంతి, భక్తి, ఐక్యతకు నిలయంగా ఉంటాయని, అలాంటివాటిని లక్ష్యంగా చేసుకొని ఇలా జాత్యహంకార చేష్టలకు పాల్పడటం సరైనది కాదన్నారు.

విక్టోరియా ప్రీమియర్‌ జసింత్‌ అల్లన్‌ దీనిపై స్పందిస్తూ.. ఈ చర్యను ఖండిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులకు లేఖ రాశారు. అందులో విధ్వేషంతో కూడిన ఈ జాత్యహంకార ఘటన తనను కలచివేసిందన్నారు. ఇది కేవలం విధ్వంసం మాత్రమే కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన ద్వేషపూరిత చర్య అని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి దాడులకు విక్టోరియాలో చోటులేదన్న ఆమె.. జరిగిన ఘటనపై విచారణకు ఆదేశించారు. ఈ విషయాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించి కారకులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, ఈ ఘటనపై విచారణను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.