
అన్నవరం రత్నగిరిపై వేద ఘోష ప్రతిధ్వనించింది. వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాల్లో భాగంగా నవ దంపతులు సత్యదేవుడు, అనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్ల సమక్షంలో వేద పండిత సదస్యం ఘనంగా జరిగింది. సత్యదేవుడు, అమ్మవార్లను, పెళ్లి పెద్దలు సీతారాములను అనివేటి మండపం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి వేదికపై ప్రతిష్ఠించి, సర్వాంగ సుందరంగా అలంకరించి, పూజలు చేశారు. రాష్ట్రం నలుమూలల నుంచీ వచ్చిన వేద పండితులు స్వామివారి ముందు తమ నాలుగు వేదాలు పఠించి, తమ విద్వత్తును ప్రదర్శించారు. అనంతరం, సత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వేద పండితులు వేదాశీస్సులందజేశారు. ఈ సందర్భంగా తిరుపతికి చెందిన చెందిన ప్రవా రామకృష్ణ సోమయాజి, రామ్‌లాల్‌శర్మలతో పాటు 180 మంది వేద పండితులను, దేవస్థానం వేద పండితులు గొల్లపల్లి ఘనపాఠి, గంగాధరభట్ల గంగబాబు, శివ తదితరులను, ఆలయ ప్రధానార్చకులు ఇంద్రగంటి నరసింహమూర్తి, కోట సుబ్రహ్మణ్యశర్మ, విశ్రాంత ప్రధానార్చకులు ఇంద్రగంటి గోపాలకృష్ణ, నాగాభట్ల సత్యనారాయణ, విశ్రాంత వ్రత పురోహితులు నాగాభట్ల కామేశ్వరశర్మ, ముత్య సత్యనారాయణ, మంగళంపల్లి కృష్ణభగవాన్‌జీలను దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మంజులాదేవి, ఏఈఓ కృష్ణారావు ఘనంగా సత్కరించారు. ఘనపాఠులకు రూ.4 వేలు, క్రమపాఠులు, విశ్రాంత అర్చకులు, వ్రత పురోహితులకు రూ.3 వేల చొప్పున పారితోషికాన్ని వారి అకౌంట్లలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.



