ప్రస్తుత కాలంలో ప్రజలు మెరుగైన జీవనం కోసం నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నం. సహజ సాగు (ప్రకృతి వ్యవసాయం) కోసం ఏకంగా దేశ రాజధాని దిల్లీ నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చేశారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ ఉద్యోగాన్ని వదిలేసి, పుట్టిన ఊరిలో ప్రకృతి సాగు చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ లక్షలాది రూపాయలు గడిస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఆదర్శ రైతు విజయగాథపై ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.
అనారోగ్యం రావడంతో వృత్తిలో మార్పు
రాజస్థాన్ రాష్ట్రం లోని భరత్‌పుర్ జిల్లాలోని పానా గ్రామానికి చెందిన కమల్ మీనా దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేసేవారు. ఆయన 2017లో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కమల్ మీనా ఆరోగ్యంగా బాగా క్షీణించింది. అప్పుడు కమల్ మనసులో ఓ ప్రశ్న వచ్చింది. పూర్వకాలంలో ప్రజలు ఎందుకు ఇంత తరచుగా అనారోగ్యాలకు గురికాలేదని ప్రశ్నకు సమాధానం కనుగొనడానికి కమల్ మీనా తన తండ్రి, గ్రామ పెద్దలు, స్థానికులను కలిశారు. గతంలో ప్రజలు స్వచ్ఛమైన ఆహారం, రసాయనాలు వాడకుండా సాగు, సమతుల్య జీవనశైలిని కలిగి ఉండేవారని తెలుసుకున్నారు. ఇది కమల్ మీనా జీవితంలో ఒక ప్రగాఢమైన మార్పునకు నాంది పలికింది. తన ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి సహజ జీవనశైలిని అవలంబించాలని నిర్ణయించుకున్నారు కమల్ మీనా. ఈ క్రమంలో తన జీవితంలో ఒక ధైర్యమైన, కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దిల్లీ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఏఈ ఉద్యోగాన్ని వదిలేశారు. తానే స్వయంగా సహజ సాగు చేయాలని నిర్ణయించుకున్నారు.
సుభాశ్ పాలేకర్ వద్ద ట్రైనింగ్
ప్రకృతి వ్యవసాయ పద్ధతులను నేర్చుకోవడానికి దేశంలోని పలు ప్రాంతాను కమల్ మీనా సందర్శించారు. ఆ సమయంలో సహజ వ్యవసాయంలో మార్గదర్శకుడిగా పరిగణించే సుభాశ్ పాలేకర్ వద్ద సుమారు 7నెలల పాటు శిక్షణ పొందారు. దేశీయ విత్తనాల ప్రాముఖ్యత, సహజ వనరుల వినియోగం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను బాగా నేర్చుకున్నారు. ఆ తర్వాత తన స్వగ్రామానికి తిరిగి వచ్చి తనకున్న ఏడు ఎకరాల భూమిలో సహజ సాగు ప్రారంభించారు.
తొలినాళ్లలో పలు సవాళ్లు
సహజ సాగు ప్రారంభించిన మొదట్లో కమల్ మీనా అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. క్రమంగా ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం ప్రారంభమైంది. అయితే కేవలం సహజ పద్ధతుల ద్వారా పంటలు పండిస్తే సరిపోదని గ్రహించారు మీనా. ఆ పంటల తదుపరి శుద్ధి ప్రక్రియను కూడా సహజ పద్ధతిలో నిర్వహిస్తే తుది ఉత్పత్తుల నాణ్యత బాగుంటుందని భావించారు. ఈ క్రమంలో గ్లైసెమిక్ ఇండెక్స్ (జీఐ) 50 కంటే తక్కువ ఉన్న సోనా మోతీ, బాన్సీ, బ్లాక్, కతియా, ఖప్లీ వంటి గోధుమ రకాలను తన వ్యవసాయ క్షేత్రంలో పండించారు. మార్కెట్లో లభించే సాధారణ గోధుమల గ్లైసెమిక్ ఇండెక్స్ 72- 80 వరకు ఉంటుంది. అలాగే వీటిలో గ్లూటెన్ శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది.
అగ్రో టూరిజం పేరిట మాస్టర్ ప్లాన్
తన ఉత్పత్తులను విక్రయించడానికి ఒక ప్రత్యేకమైన, ప్రభావవంతమైన పద్ధతిని అవలంబిస్తున్నారు కమల్ మీనా. తన వ్యవసాయ క్షేత్రంలో అగ్రో-టూరిజంను ప్రారంభించారు. దీని ద్వారా ప్రజలు ఆయన పొలాలను సందర్శించి, సహజ వాతావరణాన్ని ఆస్వాదించి, అక్కడ పండించిన సేంద్రీయ ఆహారాన్ని రుచి చూడవచ్చు. ప్రజలు ఈ అనుభవాన్ని ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. తత్ఫలితంగా వారు కమల్‌కు రెగ్యులర్ కస్టమర్లుగా మారిపోతున్నారు.
తాను చేస్తున్న సహజ సాగు గురించి ఈటీవీ భారత్‌కు కమల్ మీనా వివరించారు. “ప్రజలు నా వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చి స్వచ్ఛమైన, సహజమైన ఆహారాన్ని తినడాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో సాధారణ ఆహారానికి, సేంద్రీయ పద్దతిలో పండించిన పంటలతో చేసిన ఆహారానికి మధ్య ఉన్న తేడాను గ్రహిస్తున్నారు. అందుకే వారు నా ఉత్పత్తులను కొనడానికి మళ్లీ మళ్లీ వస్తున్నారు. ఉత్పత్తుల విలువను దృష్టిలో ఉంచుకుని నేనొక హైడ్రాలిక్ కోల్డ్ ప్రెస్ యంత్రాన్ని ఏర్పాటు చేశాను. ఇది గింజలను (ఆవాలు మొదలైనవి) వేడి చేయకుండా నేరుగా వాటి నుంచి నూనెను తీస్తుంది.

ఈ నూనె పలుచగా, స్వచ్ఛంగా, అధిక పోషకాలతో ఉంటుంది. అలాగే సంప్రదాయ మిల్లులు అధిక వేగంతో పనిచేయడం వల్ల పిండి వేడెక్కుతుంది. దీంతో పిండిలోని పోషక విలువలు నశిస్తాయి. అందుకే ఓ మిల్లును ఏర్పాటు చేశాను. నా మిల్లు నుంచి వచ్చే పిండి పూర్తిగా పోషక విలువలతో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ అయిన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజెస్ పథకం కింద ఈ యంత్రాలను రూ.10లక్షలకు కొనుగోలు చేశాను. అందులో 35 శాతం సబ్సిడీ లభించింది. ఏడు ఎకరాల విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేపట్టడం ఆవుల సహాయంతోనే సాధ్యమైంది. నా వద్ద సుమారు 15 గిర్ జాతి ఆవులు ఉన్నాయి. ఈ ఆవుల పేడతో ఒక బయోగ్యాస్ ప్లాంట్‌ను నడుపుతున్నారు. తద్వారా లభించే ఎరువును నా పొలాల్లో వేస్తున్నాను. ” అని కమల్ మీనా తెలిపారు.





