ArticlesNews

తరతరాలుగా సేంద్రియ వ్యవసాయం- ఎరువులు వాడే పొలం కన్నా అధిక దిగుబడి

0views

వ్యవసాయంలో రసాయనాల వినియోగం, పెరుగుతున్న ఖర్చులు అన్నదాతల నడ్డి విరుస్తున్న వేళ ఓ రైతు కొత్త ఒరవడిని సృష్టించారు. సుమారు 65 ఎకరాల భూమిలో పూర్తిగా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పూర్వీకుల సంప్రదాయాలను పాటిస్తూనే అరుదైన వరి వంగడాలను పరిరక్షిస్తున్నారు. ఇంతకీ ఆయన ఎవరు? సేంద్రీయ పద్ధతిలో ఆయన ఎలా లాభాలు గడిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛత్తీస్​గఢ్ మహాసముంద్ జిల్లా బస్నా బ్లాక్‌లోని మిలారాబాద్​ అనే గ్రామానికి చెందిన రైతు అంతర్యామి ప్రధాన్ సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. తనకున్న 27 ఎకరాల భూమిలో ఇప్పటికీ ఒక్క గింజ యూరియా, DAP గానీ వాడలేదని అంటున్నారు. తన పూర్వీకుల సంప్రదాయాలను కొనసాగిస్తూ, ఆవు పేడతో తయారు చేసిన ఎరువును, ఆవు మూత్రంతో రూపొందించిన పురుగుల మందులను వినియోగిస్తున్నారు. ఈ సేంద్రియ పద్ధతులను ఉపయోగించి ఆయన ఎకరానికి 18 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నారు. ఈ దిగుబడి రసాయన వ్యవసాయం ద్వారా లభించే దిగుబడికి ఏమాత్రం తీసిపోదంటున్నారు.

సేంద్రియ వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి
రసాయన ఎరువులతో వ్యవసాయం చేయడానికి ఎకరానికి 20,000 నుంచి 25,000 రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతు అంతర్యామి ప్రధాన్ తెలిపారు. దీనికి భిన్నంగా సేంద్రియ పద్ధతితో ఈ ఖర్చు కేవలం 5,000 నుంచి 7,000 రూపాయలకు తగ్గిపోయిందని చెప్పారు. సేంద్రియ పద్ధతులను ఉపయోగించి ఆయన ఎకరానికి 18 నుంచి 22 క్వింటాళ్ల దిగుబడిని సాధిస్తున్నట్లు పేర్కొన్నారు.

పశువుల నుంచి సేంద్రియ ఎరువులు, సహజ పురుగుమందులు
సేంద్రీయ వ్యవసాయంలో విజయానికి వెన్నెముకగా తన వద్ద ఉన్న 60 పశువులు నిలుస్తున్నాయని రైతు అంతర్యామి ప్రధాన్ వెల్లడించారు. ప్రతి ఏటా ఆయన 250 నుంచి 270 ట్రాలీల సేంద్రియ ఎరువును ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. వేప, ఉమ్మెత్త, సీతాఫలం చెట్ల ఆకులను ఆవు మూత్రంతో కలిపి, ఆయన ‘బ్రహ్మాస్త్రం’ అనే ఒక సహజ పురుగుమందును తయారు చేసినట్లు పేర్కొన్నారూ. ఇది తన పంటలు పూర్తిగా వ్యాధి రహితంగా ఉండేలా చూస్తుందని వివరించారు. “మా కుటుంబంలో నాలుగు తరాలుగా పశుపోషణ కొనసాగుతోంది. నిజానికి, సేంద్రియ వ్యవసాయానికి పశుపోషణే మూలస్తంభం. దీంతో పాటు మేము కోళ్లు, బాతులను కూడా పెంచుతాము. అలాగే గొర్రెలు, మేకలను కూడా పోషిస్తాము.” అని రైతు అంతర్యామి ప్రధాన్ పేర్కొన్నారు.

అమ్మమ్మ పేరుతో సేంద్రియ ఉత్పత్తుల బ్రాండింగ్
ఇంకా కాలా నమక్, చిన్నౌర్, కాళీ మూచ్, దుబ్రాజ్ వంటి అరుదైన వరి రకాలను పరిరక్షించడంలోనూ అంతర్యామి ప్రధాన్ చురుకుగా కృషి చేస్తున్నారు. తన అమ్మమ్మ జ్ఞాపకార్థం తన ఉత్పత్తులకు ‘శ్రీమతి’ అనే బ్రాండ్‌ పేరును పెట్టి మార్కెటింగ్ చేస్తున్నారు. ఆయన పండించే కాళీ మూచ్ వరి బియ్యం మార్కెట్​లో కిలోకు రూ. 350 వరకు ధర పలుకుతుంది. బియ్యంతో పాటు గోధుమ పిండి, పప్పుధాన్యాలు, బెల్లం, కూరగాయలతో సహా ఇతర ఉత్పత్తులను కూడా పండించి విక్రయిస్తున్నారు. తన ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి రాయ్‌పుర్, బిలాస్‌పుర్, సరైపాలి వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు వస్తుంటారని ఈ రైతు తెలిపారు.

సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తుల వాడకం వల్ల తన కుటుంబ సభ్యులు తరతరాలుగా వందేళ్లకు పైగా జీవించారని అంతర్యామి ప్రధాన్ వివరించారు. తన తాత 107 ఏళ్లు, తండ్రి, తల్లి కూడా వందేళ్లకు పైగా జీవించారని చెప్పారు. సేంద్రియ ఎరువులను ఉపయోగించి పండించిన పంటలనే ఆహారంగా తీసుకోవడం వల్లే వారు అంత ఆరోగ్యంగా జీవించారని గుర్తు చేశారు. తన పూర్వీకులు ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని అన్నారు. మొదటగా వరి పండించి విక్రయించేవారని, ఆ తర్వాత గోధుమలు, కందులు, బెల్లం పండించేవారని తెలిపారు.

Organic Farming

సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్న పంట 

ఇతరులకు ఉపాధి కల్పిస్తున్న రైతు
అంతర్యామి ప్రధాన్ స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈయన దగ్గర 10 నుంచి 25 మంది పనిచేస్తున్నారు. సరైన పద్ధతులను అవలంబిస్తే, వ్యవసాయం అనేది నష్టదాయకమైన వ్యాపారం కాదని, లాభదాయకమైందని అంటున్నారు. ఇతర రైతులు కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అవలంబించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కూరగాయలు, ఆకుకూరల అమ్మకం కోసం ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తులకు, రసాయన ఎరువులతో పండించిన కూరగాయలకు ప్రత్యేక మార్కెట్​ ఉండాలని అంటున్నారు. అంతర్యామి ప్రధాన్ కీర్తి ఛత్తీస్‌గఢ్‌ దాటి రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విస్తరించింది. మహాసముంద్ కలెక్టర్ వినయ్ కుమార్ లాంగే కూడా ఆ రైతును ప్రశంసించారు. రైతులందరూ సాధ్యమైనంత వరకు సేంద్రియ వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.