
0views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి మూలం ‘‘సంఘ శాఖ’’. సంఘ సిద్ధాంతాలను ప్రజలకు చెప్పడానికి స్వయంసేవకులు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. సంఘ సిద్ధాంతం అద్వితీయమైనందున ఒక పట్టాన ప్రజలు అర్థం చేసుకోలేరు. సంఘాన్ని ప్రజలకు అర్థం చేయించేందుకు ఒక సులభమార్గం వుంది. అదే ‘‘సంఘ శాఖ’’. శాఖ సంఘ కార్యక్రమాలకు బహిర్గత స్వరూపం. ఆరెస్సెస్ రెండో సర సంఘచాలక్ (చీఫ్) గోళ్వాల్కర్ వున్న సమయంలో ఓ పెద్ద మనిషితో సుదీర్ఘ చర్చ జరిగింది. సంఘం అంటే ఏమిటి? సమాజ సంఘటన అంటే ఏమిటి? సంఘం ఎలా పనిచేస్తుంది? ఇలాంటి అనేక విషయాలను ఆయనకు వివరించే ప్రయత్నం చేశాను. ఇవేమీ ఆయనకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆయనను ఒక మంచి శాఖలో జరుగుతున్న కార్యక్రమానికి ఆహ్వానించారు. శాఖలో పాల్గొంటున్న పలువురు స్వయంసేవకులను ఆయన చూశారు.
అనుశాసనా బద్ధంగా ఒకదాని వెంట మరొకటి కార్యక్రమాలు జరిగాయి. వీటి ప్రభావం ఆయన మనస్సుపైబలంగా పడింది. వెళ్తున్న సమయంలో గురూజీతో ఆయన మాట్లాడుతూ ‘‘సంఘం చాలా మంచిది. సంఘ సిద్ధాంతాలు చాలా గొప్పవి’’ అని చెప్పారు.
సంఘం అంటే శాఖ. శాఖలు విస్తృతం, సుసంబద్ధం, వ్యవస్థితం, అనుశాసితం, ఉత్సాహ పూర్వకంగా జరుగుతాయో అంత గొప్పగా ప్రజలు సంఘాన్ని అర్థం చేసుకోగల్గుతారు. అయితే మంచి శాఖను నిర్మించడం ఎలా? అని స్వయంసేవకులు ఆలోచించాలి. వ్యక్తిగతంగా అనేక సద్గుణాలు వుండొచ్చు. పనిచేయాలన్న ఉత్సాహం కోరిక వుంటాయి. దేశానికి సేవ చేయాలన్న దృఢమైన సంకల్పం వుంటుంది. కానీ, ఒక్కరితో శాఖ నడవదు. ప్రతి వ్యక్తి తన ఇంట్లో ఉత్తముడిగా జీవిస్తూ వుండొచ్చు. ఈ ఒంటరితనమే సమాజానికి పెద్ద శత్రువు. ఒంటరితనం కారణంగానే అతనిలో ధైర్యం సన్నగిల్లుతుంది. పౌరుషత్వం లోపిస్తుంది. పెద్ద పెద్ద సంకట పరిస్థితులు ఏర్పడినప్పటికీ ఒంటరితనం గుప్పెట్లో ఇరుక్కొని, బయటకు రాలేని వారు చాలా మంది కనిపిస్తుంటారు.
నాగపూర్ లో ఒక సభ జరుగుతున్నప్పుడు గొడవ జరిగింది. ప్రజలు చెల్లాచెదురయ్యారు.ఏ దారి దొరికితే ఆ దారి వెంట పరిగెత్తారు. అప్పుడు ఎందుకు పరుగెడుతున్నారని అడిగితే అక్కడ పెద్ద గొడవ జరిగిందన్నారు. గొడవ గురించి అడిగితే చాలా పెద్ద గొడవ జరిగింది. నేను ఒక్కడినే ఏం చేయగలుగుతాను అని ఎవరికి వారు సమాధానం చెప్పారు. ఆ సభలో సుమారు 25000 మందికి పైగా పాల్గొన్నారు. పాతిక వేల మంది పాల్గొన్నప్పటికీ ప్రతి ఒక్కరూ ఒంటరి వారే. అది 25,000 మంది ఒంటరి వాళ్ల సమూహం. సమాజం కాదు.
ఒంటరి తనం యొక్క పరిణామం ఇదే. కాబట్టి మొట్ట మొదటగా మనం ఈ ఒంటరితనాన్ని వదిలించుకోవాలి. అందుకే సంఘ నిర్మాత డాక్టర్జీ మిత్రులను పెంచుకోండి, అవసరం వచ్చినప్పుడు ఆ మిత్రులు మీ కోసం తమ సర్వస్వాన్ని పణఫంగా పెట్టడానికి సిద్ధంగా వుండాలి. అని అనేవారు. ఇంతే కాకుండా ఏ వ్యక్తిలోనైతే కనీసం 8-10 మంది కొత్త వ్యక్తులతో పరిచయం పెంచుకొని మిత్రులుగా మార్చుకునే శక్తి వుండదో ఆ మనిషి జీవితం వృథా అని అంటుండేవారు డాక్టర్జీ. వాస్తవానికి చైతన్యవిహీనమైన వ్యక్తి ఒకరకంగా వృథాయే.
స్వార్థం కోసం కొంత మందితో పరిచయం చేయడం సాధారణం. అది స్నేహం కాదు. మన భావనలు మన ఆలోచనలు మన పని మన సుఖ దు:ఖాలు పంచుకోగలిగినప్పుడే అది స్నేహం అవుతుంది. ఒకరి కోసం మరొకరు తాపత్రయం పడాలి. వీరిద్దరి అస్తిత్వం ఒక్కటి అయినప్పుడే అది మిత్రత్వం అవుతుంది. మిత్రులను పొందేందుకు కష్టపడాలి. ఒకే రకమైన పరంపర సమానత్వం వున్న వారితో స్నేహం చేయడం కష్టం కాదు. వీరి సంస్కారాలు ఆదర్శాలు దాదాపుగా ఒకేలా వుంటాయి. మనం ఏ సమాజానికి చెందిన వారం అన్న ఆత్మ విస్మృతి కలిగినప్పుడే స్నేహ బంధం ఏర్పడటంలో ఇబ్బందులు కలుగుతాయి.
సువిశాల భారతంలో మనం వుంటున్న ప్రాంతం ఒక చిన్న భాగం. మన సంస్కారాలతో ఈ చిన్న ప్రాంతాన్ని ప్రభావితం చేయాలి. మనం వుంటున్న ప్రదేశంలోని ఆబాల వృద్ధులు మహిళలు, పురుషులు మన నుంచి ప్రేరణ పొందాలి. మనల్ని ఆదర్శంగా భావించాలి. మన సుఖ దుఖాలు మన శ్రద్ధా కేంద్రాలు ఒకటేనని వీరు భావించాలి. అందరి అంత:కరణాలలో అందరి పట్ల సమాన భావన వుండాలి. మన ప్రాంతంలోని ప్రతి ఒక్కరితో నిరపేక్ష నిస్వార్థ మిత్రత్వాన్ని స్థాపించాలి. ప్రయత్న పూర్వకంగా మన మిత్రుల సంఖ్యను పెంచుకోవాలి. ఈ రకంగా మన మన కార్యక్షేత్రాలను ప్రభావితం చేస్తూ సంపూర్ణ సమాజాన్ని కలపగలగాలి.
మన సిద్ధాంతాలను అంగీకరించడానికి ఒక్కొక్కసారి పాత మిత్రులు అంతగా ఉత్సాహం చూపించరు.సుదీర్ఘ స్నేహం కారణంగా చనువు ఏర్పడుతుంది. అప్పుడు మన సిద్ధాంతాలను తేలికగా తీసుకునే వాతావరణం కలగవచ్చు. ప్రపంచానికి ఉపదేశాలు ఇవ్వడానికి బయలుదేరాము. కానీ మన ఇంటి చుట్టు పక్కల వుండే వారికి, మిత్రులకు మన సిద్ధాంతాలను వివరిచే ప్రయత్నం చేయం. వారిలో సంస్కారాలు నింపేందుకు కృషిచేయం. వీరంతా మనవారేనన్న అభిప్రాయం కారణంవగా ఇలా జరుగుతుంది. పాత మిత్రులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం లేదని అనుకుంటాం. అయితే కొత్త వారిపై ఎంతైతే ప్రయత్నం చేస్తామో అంతే ప్రయత్నాన్ని పాత మిత్రులపై కూడా చేయాలి.
స్వయంసేవకుల మనసులలో కపటం లేదని, ఎలాంటి స్వార్థం లేదని నమ్మినప్పుడే ప్రజలు మన సిద్ధాంతాలను అంగీకరిస్తారు.మంచి మనస్సుతో స్నేహం చేస్తామని అనిపిస్తేనే స్వయంసేవకులు చెప్పే విషయాలను అంగీకరిస్తారు.మనం ఏమి చెప్పినా వారి క్షేమాన్ని కాంక్షించే చెబుతున్నామన్న విశ్వాసం కలగాలి. నా జీవితం సఫలం కావడానికే కష్టతరం అయినా సరైన మార్గాన్ని సూచిస్తున్నామని ప్రజలు నమ్మాలి. ఇలా కొత్తా, పాత మిత్రులను కలుపుకుంటూ ముందుకు సాగాలి.





