
రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా, తర్లుపాడు మండలంలోని కలుజువ్వలపాడు పంచాయితీలోని లింగారెడ్డి కాలనీలో గత ఐదేళ్ల నుంచి చర్చిలోనే బడిని కొనసాగిస్తున్నారు. లింగారెడ్డి కాలనీకి 2017లో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలను మంజూరు చేసింది. రెండేళ్లపాటు ఒక అద్దె గదిలో పాఠశాలను నిర్వహించి తర్వాత పాఠశాల యాజమాన్యం చర్చిలో పాఠశాలను నిర్వహిస్తునారు. గత ఐదేళ్ల నుంచి చర్చిలోనే విద్యాబోధనను నిర్వహిస్తున్నారు ఉపాధ్యాయులు.
ఈ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉంది. విద్యార్థులు 23 మంది ఉన్నారు. చర్చిలో విద్యాబోధన చేస్తూ పిల్లలను క్రైస్తవీకరణ చేసే కుట్ర చేస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. నిజానికి గత వైసీపీ పాలనలో పాఠశాల సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి గ్రామస్థులు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నాడు నేడు పేరుతో అనేక స్కూళ్లను ఏర్పాటు చేసిన ఈ పాఠశాలను విస్మరించింది. ప్రాథమిక పాఠశాలకు భవనం నిర్మించాలని, చర్చిలో విద్యాబోధన ఆపాలని కాలనీ వాసులు కోరుకుంటున్నారు.





