
గిరిజనుల సశక్తీకరణ కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆదికర్మయోగి కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు చేస్తామని, ఈ కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలోని ప్రజల అభిప్రాయాలను స్వీకరించి, వారి సమస్యలపై ప్రభుత్వంతో నేరుగా చర్చించే అవకాశాన్ని కల్పిస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మిడి సంధ్యారాణి చెప్పారు.
విజయవాడలో “ఆదికర్మయోగి” కార్యక్రమంపై మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విప్లవాత్మక కార్యక్రమాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో ఉన్నామని మంత్రి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ₹8.80 లక్షలు మంజూరు చేసిందని . ఒక్కో మాస్టర్ ట్రైనర్‌కు ₹5,500 చొప్పున సహాయం అందించామని మొత్తం 40 మంది SMTలు శిక్షణ పొందుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమం ప్రధానంగా గిరిజన గ్రామాల అభివృద్ధి దిశగా ప్రజల్లో చైతన్యం పొందేందుకు రూపొందించబడిందని ‘ఆదికర్మయోగి’ అనేది ఒక ప్రజా చైతన్య ప్రక్రియ అని అన్నారు. ఇది ప్రతి గిరిజన గ్రామానికి మార్గనిర్దేశం చేయగల నాయకత్వాన్ని అందించే పథకమని దీన్ని కేవలం శిక్షణల స్థాయిలో ఆపకుండా, గిరిజన ప్రజలు జీవనశైలిలో మార్పు తీసుకొచ్చేలా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.





