News

భారతీయ గణితానికి కొరియాలో గౌరవం

203views

దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లో జరుగుతున్న తూర్పు ఆసియా 9వ గణిత విద్యాసదస్సులో భారతీయ సంప్రదాయ గణిత పద్ధతులకు గుర్తింపు లభించింది. జులై 18 నుంచి 22 వరకు ఈ సదస్సు జరుగుతోంది. ‘గణితంపై ఉపాధ్యాయులు, విద్యార్థుల వైఖరిలో మార్పులు’ అనే శీర్షికతో భారతీయ సంప్రదాయ గణిత పద్ధతులపై ఒక పరిశోధనా పత్రం ఈ ప్రదర్శనకు ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ సదస్సులో భారతదేశం తొలిసారిగా పాల్గొని రికార్డు సృష్టించింది.

ఈ పరిశోధనా పత్రాన్ని తమిళనాడులోని ఆరోవిల్లేకు చెందిన శ్రీ అరబిందో అంతర్జాతీయ విద్యా పరిశోధన సంస్థ ఛైర్మన్‌ డాక్టర్‌ సంజీవ్‌ రంగనాథన్, ఆరోవిల్లె స్కూలు గణిత ఉపాధ్యాయురాలు పూవిజి సంయుక్తంగా రూపొందించారు. గుజరాత్‌ అదనపు ప్రధాన కార్యదర్శి, ఆరోవిల్లే ఫౌండేషను కార్యదర్శి డాక్టర్‌ జయంతి ఎస్‌.రవి వీరికి అండగా నిలిచారు. డాక్టర్‌ జయంతి రవికి హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో మెట్రాలజీ బోధించిన అనుభవముంది. భారత్‌ నుంచి ఈ సదస్సులో పాల్గొన్న డాక్టర్‌ సంజీవ్‌ రంగనాథన్, మ్యాథ్స్‌ టీచర్‌ పూవిజి తయారుచేసిన పరిశోధన పత్రం ఆధునిక విద్యలో సంప్రదాయ భారతీయ గణిత పద్ధతులను ఎలా ఉపయోగించుకోవచ్చో తెలియజేసింది.