
ఉగ్రమూకలను పెంచి పోషిస్తోన్న పాకిస్థాన్ ఇప్పుడు మరో దుస్సాహసానికి ఒడిగట్టింది. ఉగ్రవాదులకు, హైజాకర్లకు ఆశ్రయం కల్పించిన వారికి మరణశిక్షను రద్దు చేసింది. ఈ మేరకు ఏకంగా చట్టంలో సవరణలు చేసింది. దీనికి సంబంధించిన బిల్లుకు పాక్ సెనెట్ తాజాగా ఆమోదముద్ర వేయడం గమనార్హం.
పాక్ పీనల్ కోడ్ చట్టాల ప్రకారం.. హైజాకింగ్‌కు పాల్పడిన వ్యక్తికి ఉద్దేశపూర్వకంగా ఆశ్రయం కల్పిస్తే గరిష్ఠంగా మరణశిక్ష ఎదుర్కొంటారు. ఇక, బహిరంగంగా మహిళపై బలప్రయోగం చేసి ఆమెను వివస్త్రను చేస్తే గతంలో ఏడేళ్ల జైలు శిక్ష ఉండేది. 1983లో జనరల్ జియా ఉల్‌హక్ పాలనలో దాన్ని మరణశిక్షగా మార్చారు. అయితే, ఈతరహా నేరాల్లో శిక్షను తగ్గించాలని పాకిస్థాన్‌లో కొంతకాలంగా డిమాండ్లు మొదలయ్యాయి.
ఈక్రమంలోనే తాజాగా క్రిమినల్ చట్ట సవరణ బిల్లు 2025ను తీసుకొచ్చారు. అందులో హైజాకర్లకు ఆశ్రయం కల్పించడం, మహిళలను బహిరంగంగా వివస్త్రను చేయడం వంటి నేరాల్లో దోషులుగా తేలిన వారికి శిక్షలను తగ్గిస్తూ ప్రతిపాదనలు చేశారు. ఇందుకు పాక్ సెనెట్ ఆమోదం తెలిపింది. ఈ నేరాలకు మరణశిక్షలను తొలగించి.. దాని స్థానంలో దోషులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించేలా చట్టంలో మార్పులు చేసింది. అత్యంత తీవ్రమైన నేరాల్లో మాత్రమే మరణశిక్ష విధించేలా సవరణ బిల్లును రూపొందించింది. త్వరలోనే ఈ బిల్లు చట్టరూపం దాల్చనుంది. అయితే, దీనిపై విపక్షాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనా పాక్ ప్రభుత్వం వాటిని పరిగణనలోకి తీసుకోలేదు.
పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ఇటీవల పహల్గాం ఉగ్రదాడితో ఇది మరోసారి బహిర్గతమైంది. భారత్‌లో పలు మారణహోమాలకు కారణమైన లష్కరే తొయ్యిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్ర ముఠాలు పాక్ గడ్డ నుంచే తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. లష్కరే అధినేతను జైల్లో పెట్టామని దాయాది చెబుతున్నప్పటికీ.. అతడికి అక్కడ రాచమర్యాదలు అందుతున్నట్లు నిఘా వర్గాల సమాచారం. ఇక, జైషే చీఫ్ మసూద్ అజార్‌కు స్వయంగా పాక్ ప్రభుత్వమే పటిష్ట భద్రతను కల్పిస్తున్నట్లు ఇటీవల పలు కథనాలు వెలువడ్డాయి.





