News

శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ వల్లే భారత్‌లో కశ్మీర్‌ భాగమైంది: షా

279views

భారతీయ జనసంఘ్‌ వ్యవస్థాపకుడు శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ లేకపోతే కశ్మీర్‌ భారత్‌లో ఎన్నటికీ కలిసేది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ జయంతి పురస్కరించుకుని ఆయనకు అమిత్‌షా నివాళులర్పించారు.ఈ సందర్భంగా గుజరాత్‌లోని ఆణంద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. దేశానికి ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌ కోసం ఆయన చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకున్నారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే భారత రాజ్యాంగంలోని 370 ఆర్టికల్‌ను శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ తీవ్రంగా వ్యతిరేకించారు. కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించకుండా భారత్‌లోనే పూర్తిగా విలీనం చేయాలని వాదించారు. అలాగే బెంగాల్‌ ఈ రోజున భారత్‌లో భాగంగా ఉండటానికీ కూడా శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ, స్వామి ప్రణవానందే కారణం’’ అని అమిత్‌ షా అన్నారు.

ఇక 10 మందితో ప్రారంభించిన భారతీయ జనసంఘ్‌ ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద రాజకీయ పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు. అనంతరం ఆయన అమూల్‌ డైరీ నాల్గో వార్షికోత్సవంలో పాల్గొన్నారు. సహకార రంగం పని సంస్కృతిలో పారదర్శకత, సాంకేతికత, ప్రజా సంక్షేమాన్ని అంతర్భాగం చేయాలని వాణిజ్య సంస్థలకు పిలుపునిచ్చారు.