ArticlesNews

జగన్నాథుడికి 9 కుండల్లో ప్రత్యేక పానీయం- ఆ వెంటనే పారబోస్తారు! ఎందుకలా?

249views

ఒడిశాలోని పూరీ జగన్నాథ బహుడా (తిరుగు) రథయాత్ర అత్యంత వైభవంగా కొనసాగింది. కోట్లాది మంది భక్తుల జయజయ ధ్వానాల మధ్య జగన్నాథ, బలభద్ర, సుభద్రలు (ముగ్గురు మూర్తులు) నందిఘోష్, తాళధ్వజ, దర్పదళన్‌ రథాల్లో శ్రీక్షేత్ర వెలుపలకు చేరుకున్నారు. ఆ తర్వాత ‘సున్నాభెషొ’లో భాగంగా 208 కిలోల బంగారు ఆభరణాలతో దర్శనమిచ్చారు.

ఇప్పుడు ‘అధర్​​పణ’ కార్యక్రమానికి సేవాయత్​(సేవకుడు)లు సిద్ధం చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో రథాలపై ఉన్న దేవతామూర్తుల దాహాన్ని తీర్చడం కోసం మట్టికుండల్లో ‘పొనా’ (తీపి పానీయం) నివేదిస్తారు. ఆ తర్వాత కుండలు పగలుగొట్టి పానీయాన్ని పారబోస్తారు. మరి ఆ పానీయాన్ని ఎలా తయారు చేస్తారు? దాని విశిష్టత, వాడే పదార్థాలు ఏంటి? ఎందుకు పారబోస్తారు?

‘అధర్​​పణ’ కార్యక్రమం ఎలా నిర్వహిస్తారు?
‘సున్నాభెషొ’ తర్వాత రోజు మహాప్రభు మధ్యాహ్న ప్రసాదం నివేదన తర్వాత ‘అధర్​​పణ’ నిర్వహిస్తారు. రథంపై ఉన్న దేవతామూర్తుల పెదవులను తాకే ఎత్తులో కుండలను ఏర్పాటు చేస్తారు. ఆ కుండల్లో తీపి పానీయాన్ని ఉంచుతారు. ఇందుకోసం ఆలయం ముందున్న బావి నుంచి నీటిని ఇత్తడి కుండల్లో తెచ్చి ప్రత్యేక మట్టి కుండల్లో వేస్తారు. అందులో పసుపు, జాజికాయ, పాలు, చక్కెర, యాలకులు, బెల్లం, నెయ్యి, కుంకుమ, కర్పూరం, అరటిపండ్లు వంటి వివిధ రకాల పదార్థాలను వేసి తయారు చేస్తారు.

ఆ తర్వాత ఆలయ సేవాయత్​లు తొమ్మిది కుండల్లో పానీయాన్ని నివేదిస్తారు. ప్రతి రథం వద్ద మూడు కుండల్లో మొత్తం తొమ్మిది కుండల్లో నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఆ తర్వాత స్వామివారి తృప్తి కోసం ఆ కుండలను పగలగొడతారు. అలా చేస్తే మిగిలిన దేవతలు, చండి చాముండా, నిరాకార జీవులు పానీయాన్ని తాగి వారి యథాస్థానాలకు చేరుకుంటారని భక్తుల నమ్మకం. చండి చాముండ సహా దేవతలంతా జగన్నాథుడి రథయాత్రలో ప్రయణిస్తారని అక్కడి ప్రజల నమ్మకం.

‘అధర్​పణ’ ఆచారం గతంలో ఎలా ఉండేది?
గతంలో మూడు రోజుల పాటు ‘అధర్​పణ’ చేపట్టేవారు. కొన్నేళ్ల తర్వాత ఆ ఆచారాన్ని ‘సున్నాభెషొ’ తర్వాత రోజు మాత్రమే నిర్వహిస్తున్నారు. జగన్నాథ, బలభద్ర, సుభద్రలు ఆలయంలోకి వెళ్లేముందు నిరాకార జీవులను, ఇతర దేవతలను సంతృప్తిపరచడానికి చేస్తారు.

‘సున్నాభెషొ’ అంటే ఏమిటి?
జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రతల దేవతామూర్తులను పసిడితో అలంకరించి రథంపై ఊరేగించడాన్ని ‘సునా భేషా’గా పిలుస్తారు. ఆచారాన్ని ఆదివారం సాయంత్రం 6.30 నుంచి రాత్రి 11 గంటల వరకు నిర్వహించారు. దేవుళ్లను 208 కిలోల బంగారు ఆభరణాలతో చక్కగా అలంకరించారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలకు బంగారం, వెండి, వజ్రం ఇతర విలువైన లోహాలతో సహా దాదాపు 30 రకాల ఆభరణాలతో అలంకరించారు.