
నెల్లూరు: భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం ప్రపంచానికే ఆదర్శప్రాయమని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు.
నెల్లూరులోని జగదీశ్‌నగర్‌లో అత్యంత వైభవంగా నిర్వహించిన మహా రుద్రాభిషేకం, చండీ హోమం, లలితా సహస్రనామ పారాయణం కార్యక్రమాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “భక్తి ఉన్న చోట శాంతి, ధర్మం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది” అని అన్నారు. లోకకళ్యాణం, కుటుంబ సౌఖ్యం, సమాజ శ్రేయస్సు కోసం నిర్వహించే యాగాలు, హోమాలు సానుకూల శక్తిని ప్రసరిస్తాయని, యువతలో నైతిక విలువలు, ధార్మిక చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
సనాతన ధర్మం బోధించే సత్యం, సేవ, సంస్కారం వంటి విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని మంత్రి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.





