
నాయకత్వం పదవుల్లో ఉండదని, ఉత్తమ వ్యక్తిత్వం, నడవడికలే నాయకుడిని నిర్ణయిస్తాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రస్తుతం రాజకీయాల తీరుతెన్నులు మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. హింసను ప్రోత్సహించేలా ఇటీవల ‘రప్పా.. రప్పా’ అనే సినిమా డైలాగును నాయకులు సమర్థించడం బాధాకరమని పేర్కొన్నారు. ఇలాంటి నాయకులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతులు గాంధీ స్ఫూర్తితో స్వరాజ్య సాధన కోసం తమ యావదాస్తిని, జీవితాలను అంకితం చేశారని శ్లాఘించారు. వారి జీవిత విశేషాలతో రూపొందించిన ‘నిరుపమాన దేశభక్తులు పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి’ పుస్తకాన్ని ఆదివారం హైదరాబాద్ మాదాపూర్‌లోని దసపల్లా హోటల్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా విచ్చేశారు.
ప్రజాప్రతినిధులు చదవాల్సిన పుస్తకం
ఏపీలోని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వచ్చిన స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకుంటే పసల కృష్ణమూర్తి దంపతుల వంటి మహనీయుల ఆశయాలను సాధించినట్టు. ప్రస్తుతం శాసనసభ్యుడంటే ఎవరికీ గౌరవం లేకుండా పోయింది. దోచుకోవడం, దాచుకోవడమే పని అని భావిస్తున్నారు. దీనివల్ల ఎమ్మెల్యేగా ఎందుకు నిలబడ్డామా అనే బాధ కలుగుతోంది. ఈ పుస్తకం చదివాక నా మనసు ఆర్ద్రతతో నిండిపోయింది. ప్రతి ప్రజాప్రతినిధి ఈ పుస్తకాన్ని చదవాలి’’ అని సూచించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి రాజమౌళి మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్ర సంగ్రామ వృక్షంలోని అజ్ఞాత పుష్పాలు పసల కృష్ణమూర్తి దంపతులు. ఇలాంటి మహనీయుల చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. పసల కృష్ణమూర్తి.. గోదావరి గాంధీ మాదిరిగా కనిపిస్తారు’’ అని కొనియాడారు. ‘ఈనాడు’ ఏపీ సంపాదకులు ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నాటి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల పునాదులపైనే నేడు మనం ఈ స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామనే విషయం యువతీయువకులకు తెలిసేలా పాఠ్యాంశాలను రూపొందించాలని అన్నారు. ప్రతి స్కూలు గంథాలయంలో ఈ పుస్తకం ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో పుస్తక రచయిత గాదం గోపాలస్వామి, కృష్ణమూర్తి కుమార్తె డాక్టర్ వీణ, మనవరాలు ఆదిలక్ష్మి మాట్లాడారు. కృష్ణమూర్తి కుమారుడు శివాజీ, ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
గర్భవతిగా ఉన్నప్పటికీ జైలు శిక్షకు వెనుకాడలేదు
‘‘త్యాగం, నిస్వార్థగుణం, స్వాతంత్య్రం తప్ప లాభాపేక్ష లేని పసల కృష్ణమూర్తి, అంజలక్ష్మి దంపతుల పోరాటం అనుపమానమైనది. సహాయనిరాకరణ, ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో పాల్గొన్న వారు.. ఎంతో ఆదర్శనీయం. గాంధీజీ సూచనతో బంగారం విరాళంగా ఇవ్వడమే గాక, జీవితాంతం పుత్తడిని కొనని వారి నిష్ఠ స్ఫూర్తిదాయకం. స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చే పింఛనును నిరాకరించిన గొప్ప వ్యక్తిత్వం వారిది. పదవులను త్యజించడం, సిద్ధాంత వైరుధ్యం కలిగిన వారికి కూడా ఆశ్రయమివ్వడం, తప్పును తప్పు అని కరాఖండిగా చెప్పి జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడడం, గర్భవతిగా ఉన్నప్పటికీ జైలు శిక్షకు వెనుకాడని అంజలక్ష్మి జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలి’’ అని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు.





