
న్యూఢిల్లీ: మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై కార్తీక దీపం వెలిగించే అంశంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ విపుల్ పంచోలీతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా మద్రాస్ హైకోర్టు జనవరిలో ఉత్తర్వులు జారీ చేయగా, తమిళనాడు ప్రభుత్వం జూన్‌లో సుప్రీంకోర్టును ఎందుకు ఆశ్రయించిందని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషన్ దాఖలులో జరిగిన ఆలస్యంపై కోర్టు ఆరా తీసింది.
తిరుప్పరంకుండ్రం కొండపై ఉన్న రాతి స్తంభం వద్ద దీపం వెలిగించే సంప్రదాయం కొనసాగుతోందా అనే అంశాన్ని కూడా ధర్మాసనం పరిశీలించింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సమగ్రంగా పరిశీలించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.
ప్రతివాదులు ఆరు వారాల్లోగా తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించిన ధర్మాసనం, తదుపరి విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.





