
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఓ యువతి చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ వివాదానికి దారితీసింది. ఆలయ మహామండపం ఏడో అంతస్తులోని రాజగోపురం సమీపంలో డ్యాన్స్ చేస్తూ రీల్ చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో ఈ ఘటనపై భక్తులు, స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆలయ పవిత్రతకు భంగం కలిగిందని పలువురు అభిప్రాయపడ్డారు. ఘటనపై స్పందించిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకమండలి, ఆలయ ఈవో వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో అధికారిక ఫిర్యాదు చేసింది.
దేవస్థానం అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జులై 30న మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 1.47 గంటల మధ్య ఈ దృశ్యాలు చిత్రీకరించినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. సంబంధిత యువతికి చెందిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలు, రీల్ వీడియోతో పాటు ఇతర ఆధారాలను విచారణ నిమిత్తం పోలీసులకు అందజేసినట్లు తెలిపారు.
దేవాదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వ్యక్తిని గుర్తించి, చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని దేవస్థానం పోలీసులను కోరింది. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.





