News

భగవద్గీత బోధనలు మత ప్రచారం కాదు!

4views

దరఖాస్తు తిరస్కరించిన ఐటీ కమిషనర్‌ 
వరల్డ్‌ సంకీర్తన్‌ టూర్‌ ట్రస్ట్‌ అనే సంస్థ 2010 మే 26న ఏర్పాటైంది. గో సంరక్షణ, గోశాలల నిర్వహణ, పశువులకు వైద్య సదుపాయాలు కల్పించడం, సమాజంలో నైతిక, జాతీయ విలువలను పెంపొందించడం ఈ ట్రస్ట్‌ ప్రధాన ఉద్దేశాలు. ఈ ట్రస్టుకు 2021 మే 28న సెక్షన్‌ 12ఏబీ కింద తాత్కాలిక రిజి్రస్టేషన్‌ లభించింది. శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా ఆదాయ పన్ను శాఖ (మినహాయింపుల) కమిషనర్‌ (సీఐటీ–ఈ) తిరస్కరించారు.

ట్రస్ట్‌ నిబంధనల్లో ఆలయాల జీర్ణోద్ధరణ అంశం కూడా ఉన్నందున దానిని పూర్తిగా మతపరమైన సంస్థగా వర్గీకరిస్తూ సెక్షన్‌ 80జీ కింద పన్ను మినహాయింపునకు నిరాకరించారు. ఈ నిర్ణయంపై ట్రస్ట్‌ ఐటీఏటీని ఆశ్రయించింది. ఆలయాల నిర్మాణం, పునరుద్ధరణ పనులు తాము ఎన్నడూ చేపట్టలేదని, భవిష్యత్తులోనూ చేయబోమని ఒక లిఖితపూర్వక హామీని సమరి్పంచింది. తమ ప్రధాన కార్యకలాపాలు కేవలం గో సంరక్షణ, జంతు వైద్య సంరక్షణ మాత్రమేనని స్పష్టం చేసింది. భగవద్గీత బోధనలు మత ప్రచారం కిందకు రావని, అవి ప్రతిఫలాపేక్ష లేని కర్మ, సామాజిక సంక్షేమం, సార్వత్రిక నైతిక సూత్రాలను బోధిస్తాయని ట్రస్ట్‌ వివరించింది.

గీత శ్లోకాలను ఉదహరించిన ట్రిబ్యునల్‌ 
ట్రస్ట్‌ వాదనలతో ఐటీఏటీ చండీగఢ్‌ ధర్మాసనం ఏకీభవించింది. భగవద్గీత ప్రవచనాలను వ్యాప్తి చేయడాన్ని మత ప్రచారంగా భావించలేమని పేర్కొంది. గీతలోని 2.47 (ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయడం), 3.19 (నిస్వార్థంగా విధులు నిర్వర్తించడం), 4.38 (జ్ఞానం విశిష్టత), లోకకల్యాణం (సామాజిక సంక్షేమం, స్థిరత్వం కోసం విధులు నిర్వర్తించడం) వంటి శ్లోకాలను ట్రిబ్యునల్‌ తన తీర్పులో ఉదహరించింది. ఈ బోధనలన్నీ సార్వజనీనమైనవని, మతాలకు అతీతంగా సమాజంలోని అన్ని వర్గాలకు మేలు చేసేవని పేర్కొంది. రాజ్యాంగంలోని ఆరి్టకల్‌ 51ఏ(ఎఫ్‌) ప్రకారం దేశ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకోవడం పౌరుల ప్రాథమిక బాధ్యతని, గీత ఆధారిత నైతిక విద్య ఈ కోవలోకే వస్తుందని ట్రిబ్యునల్‌ వ్యాఖ్యానించింది.

ఆ నిబంధన అర్థమిదే.. 
ట్రస్ట్‌ ప్రధాన ఉద్దేశాలు సామాజిక ప్రయోజనాలకు సంబంధించినవా కాదా అనేది కూడా చూడాలని ఐటీఏటీ సూచించింది. జంతు సంరక్షణ, విద్యాభివృద్ధి, వైద్య సాయం వంటివి ధార్మిక కార్యకలాపాలేనని స్పష్టం చేసింది. ట్రస్ట్‌ డీడ్‌లో ఒక నిబంధన ఉన్నంత మాత్రాన, ఆచరణలో లేని మతపరమైన అంశాన్ని సాకుగా చూపి 80జీ కింద పన్ను మినహాయింపు నిరాకరించడం సరికాదని పేర్కొంది. చారిటబుల్‌ ట్రస్ట్‌ మతపరమైన ఖర్చులు ఆ సంస్థ వార్షిక ఆదాయంలో 5 శాతానికి మించనంత వరకు ఆ సంస్థ 80జీ మినహాయింపులకు అర్హత సాధిస్తుందన్న ఆదాయ పన్ను చట్టం సెక్షన్‌ 80జీ(5బీ) నిబంధనను ఐటీఏటీ గుర్తు చేసింది. ఒకవేళ ఈ ఖర్చు 5 శాతం దాటితే ఆ విషయాన్ని నిరూపించాల్సిన బాధ్యత ఆదాయ పన్ను శాఖపైనే ఉంటుందని స్పష్టం చేసింది. వరల్డ్‌ సంకీర్తన్‌ టూర్‌ ట్రస్ట్‌ కార్యకలాపాలు చట్టపరిధిలోనే ఉన్నాయని నిర్ధారిస్తూ, వెంటనే ఆ సంస్థకు 80జీ కింద పన్ను మినహాయింపులు మంజూరు చేయాలని ఆదాయ పన్ను శాఖను ట్రిబ్యునల్‌ ఆదేశించింది.