News

పల్లె కదిలింది – 12 గంటల్లో గుడి వెలసింది

856views

చిన్న చిన్న వంతెనలను పూట, ఒక్క రోజులో నిర్మించిన ఉదంతాలున్నాయి. కాస్త శ్రద్ధ చూపితే చాలు అవి సాకారమవుతాయి. కానీ కళాకృతులు, శిల్ప సంపదను గుదిగుచ్చి ఓ మందిరాన్ని నిర్మించడం ఆషామాషీ కాదు. 12 గంటల్లోనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ఆ గ్రామస్థులు శభాష్‌ అనిపించుకున్నారు. నెలల తరబడి కొనసాగే పనులను చిత్తశుద్ధితో చేపట్టి యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం పాతకందుకూరు గ్రామస్థులు కాళికామాత మందిర నిర్మాణానికి తొలుత కంకణబద్ధులయ్యారు. గ్రామస్థులంతా కలిసి రూ.7.5 లక్షల చందాలను పోగు చేసుకున్నారు. ఒకే రోజు 12 గంటల్లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించారు. ఆదివారం ఉదయం ఎనిమిదింటికి పనులను ప్రారంభించి రాత్రి ఎనిమిదింటిలోగా ముగించేశారు. నిర్మాణంలో 20 మంది శిల్పులతోపాటు వంద మంది గ్రామస్థులు పాల్గొన్నారు. డిసెంబర్ 6న అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లు చేస్తున్నారు. లోగడ గ్రామంలోని భైరవస్వామి ఆలయాన్ని కూడా గ్రామస్థులు 24 గంటల్లో నిర్మించారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.