
బలూచిస్తాన్, పఖ్తునిస్తాన్, గిల్గిట్, బాల్టిస్తాన్.. ఏదో ఒక నాడు పాక్ పై తిరుగుబాటు బావుటా ఎగరేస్తాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సదస్యులు ఇంద్రేష్ కుమార్ అన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న సింధ్, బలూచిస్తాన్, పఖ్తునిస్తాన్ మరియు గిల్గిట్-బాల్టిస్తాన్ వంటి ప్రాంతాలు ఒక రోజు తిరుగుబాటు చేసి భారత్ లో విలీనం అవుతాయన్నారు. ‘మనం ఈ విషయంలో కొంచెం ఓపికతో ఉండాలి. భారత్, పాక్ సరిహద్దులు పాక్‌లోకి మారొచ్చు. రణ్ ఆఫ్ కచ్ నుంచి లడఖ్ ప్రాంతాల వరకు ఈ సరిహద్దు మారే అవకాశం ఉంది’ అని చెప్పుకొచ్చారు.
ఇండో-టిబెట్-చైనా సరిహద్దులోని గిరిజన కిన్నౌర్ జిల్లాలో ఉన్న షిప్కి-లా పాస్ నుండి సరిహద్దు పర్యాటక కార్యకలాపాలను హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ ప్రారంభించారు. దీని తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలో ఇంద్రేష్ కుమార్ కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఇంద్రేష్ కుమార్ మాట్లాడుతూ భారతదేశం-టిబెట్ సరిహద్దులోని షిప్కి-లా పర్వత మార్గంలో పర్యాటక కార్యకలాపాలు ప్రారంభించడం వల్ల హిమాచల్ ప్రదేశ్‌కు శ్రేయస్సు కలుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో భారత దేశ సరిహద్దు ప్రాంతాల సారభౌమత్వాన్ని నొక్కి చెబుతాయన్నారు. దేశ ప్రజలు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ సరిహద్దు మనదేనని, ఈ ప్రాంతం మనదేనని వారికి అవగతమవుతుందని, అలాగే అవతలి వైపు వున్న సరిహద్దు చైనాకి సంబంధించినదని కూడా తెలుస్తుందన్నారు. మన సరిహద్దు ప్రాంతాలను మనం బలోపేతం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
పాక్ లోని వివిధ ప్రాంతాలు ఇప్పటికే తిరుగుబాటు ధోరణితో వున్నాయని అన్నారు. పంజాబీ పాకిస్తాన్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో తీవ్రంగా విభేదిస్తోందని, పీఓజేకే భారత్ లో విలీనం కావాలని కోరుకుంటోందన్నారు. బలూచిస్తాన్ పూర్తి స్వాతంత్రాన్ని కోరుకుంటోందని, పఖ్తునిస్తాన్ స్థితి కూడా బాగోలేదని, అనిశ్చితంగానే వుందన్నారు.
ఇక.. టిబెట్ విషయంలో చైనా వ్యవహారం సరిగ్గా లేదని, టిబెట్ ను ఆక్రమించిన తర్వాత చైనా టిబెటన్ మరియు హిమాలయ బౌద్ధ బాలికలను చైనా యువకులతో వివాహాలు చేస్తోందని, ఇదంతా కుట్ర పూరితంగానే సాగుతోందన్నారు. అలాగే త్వరలోనే దలైలామా వారసుడ్ని కూడా ప్రకటిస్తామని చైనా పేర్కొందని గుర్తు చేశారు. ఆధ్యాత్మిక విషయాలలో, మత పరమైన విషయాల్లో జోక్యం సహించమని, చైనా ప్రకటనను బౌద్ధులు,టిబెటన్లు తీవ్రంగా వ్యతిరేకించాలని ఇంద్రేష్ కుమార్ సూచించారు.





