News

‘RSS నమోదు కాలేదు.. భవిష్యత్తులోనూ నమోదు కాదు’.. బీఎల్ సంతోష్

4views

బెంగళూరు: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బి.ఎల్. సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. RSS ఇప్పటివరకు నమోదు కాలేదని, భవిష్యత్తులోనూ నమోదు చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెంగళూరులోని బన్నప్ప పార్కులో హిందూ జాగరణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అఖండ భారత్ సంకల్ప దివస్’ కార్యక్రమంలో సంతోష్ ప్రసంగించారు. RSS నమోదు అంశంపై రాష్ట్ర హోం మంత్రి ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ సందర్భంగా సమాధానం ఇచ్చారు.

ఇటీవల RSSను నమోదు చేయించేందుకు న్యాయపరమైన పోరాటం చేస్తామని ప్రియాంక్ ఖర్గే ప్రకటించిన నేపథ్యంలో.. సంతోష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన బీఎల్ సంతోష్.. దేశ చరిత్రతో పాటు RSS దేశానికి అందించిన సేవలు, దాని కార్యకర్తల కృషి గురించి దేశభక్తులకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు.“నమోదైన సంస్థలు ఏం చేస్తున్నాయో మాకు తెలుసు” అని ఆయన వ్యాఖ్యానించారు.

RSS తన కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రభుత్వ సంస్థగా నమోదు అవసరం లేదనే భావనను సంతోష్ వ్యక్తం చేశారు. సంఘ్ నమోదు అంశంపై రాజకీయంగా కొనసాగుతున్న చర్చకు ఆయన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.