
స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశాలు అవుతున్నాయి. తన ప్రసంగంలో పాక్ లోని మైనారిటీలు అంటే ముఖ్యంగా హిందువుల గురించి మాట్లాడిన తీరును చూస్తుంటే పాక్ మతపరమైన మైనారిటీలను ఎలా చూస్తుందో అర్థమైపోతోంది.
అవినీతి ఆరోపణల కారణంగా తరచుగా “మిస్టర్ 10 పర్సెంట్” అని పిలవబడే జర్దారీ, పాకిస్తాన్ మరియు దాని ముస్లింలు హిందువులను సహిస్తున్నారని ప్రకటించారు. జనాభాలో హిందువులు కేవలం 3 నుంచి 4 శాతం మాత్రమే వున్నారని కూడా ప్రకటించారు. దేశంలోని ముస్లింలు వీరిని సహిస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు. నిజానికి ఓ ప్రభుత్వం మైనారిటీలను సహిస్తూ చూడాలా? లేక..వారిని కూడా సమాన పౌరులుగా చూడాలా? దీనిని బట్టే పాక్ లో హిందువుల పరిస్థితి ఏమిటో అర్థమైపోతోంది.
అంతేకాకుండా, పాకిస్థాన్ తాజా 2023 జనాభా లెక్కల ప్రకారం అక్కడి హిందువుల జనాభా 52 లక్షలు (అంటే దేశ జనాభాలో 2.17%)గా ఉంది; ఇది జర్దారీ పేర్కొన్న సంఖ్య కంటే తక్కువ.
తరుచూ రాజ్యాంగం, హక్కుల పరిరక్షణ అంటూ తెగ ఉపన్యాసాలు ఇచ్చే జర్దారీ.. ఓ మతపరమైన మైనారిటీ వర్గం గురించి మాట్లాడుతున్న సమయంలో, అది కూడా ఓ దేశాధ్యక్షుడిగా హోదాలో వుంటూ ‘‘సహిస్తున్నాం’’ అన్న పదాన్ని వాడటం మరీ విడ్డూరం.
“భారతీయుల దృక్పథం వేరు. వారి మనసులో వారి సొంత అజెండా ఉంది. వారు ‘అఖండ భారత్’ను విశ్వసిస్తారు. కానీ, ఆ మధ్యలో ఉన్న అనేక విషయాలను వారు విస్మరించారు.”మేము ముస్లింలం, వారు కాదు. అయితే, 3-4 శాతం ఉన్న హిందూ జనాభాను సహించే మనస్తత్వం కలిగిన ముస్లింలం మేము.” అంటూ ప్రకటించారు. అంతేకాకుండా 3 నుంచి 4 శాతం హిందూ జనాభాను సహించే మానసికత తమకు వుందని, వారు మాతో వుండడానికే ఇష్టపడతారంటూ ప్రకటించారు.
హిందువులపై దాడులు, బలవంతపు మత మార్పిళ్లు, మూక దాడులు,హిందూ దేవాలయాలపై దాడులు, నిత్యం హిందువులపై చిత్ర హింసలు జరిగే పాక్ లో… ఇవన్నీ మరిచి, హిందువుల విషయంలో సహిస్తున్నామని, వారు తమతో వుండడానికే ఆసక్తి చూపిస్తున్నారని ప్రకటించడం చూస్తుంటే మరీ విడ్డూరంగానే వుంది.
2023లో నిర్వహించిన పాకిస్థాన్ తాజా జనాభా లెక్కల ప్రకారం, ఆ దేశంలో హిందువుల జనాభా 52 లక్షలు లేదా మొత్తం జనాభాలో 2.17%గా ఉంది.పాకిస్థాన్ గణాంకాల విభాగం (Pakistan Bureau of Statistics) ప్రకారం, ఆ దేశంలో 52.1 లక్షల మంది హిందువులు ఉన్నారు. ఈ సంఖ్యలో ‘హిందూ జాతి’గా నమోదైన 38.68 లక్షల మంది మరియు షెడ్యూల్డ్ కులాలుగా నమోదైన 13.49 లక్షల మంది కలిసి ఉన్నారు.
పాకిస్తాన్‌లో వేధింపులు హిందువులకే పరిమితం కాలేదు. క్రైస్తవులు, అహ్మదీయ ముస్లింలు కూడా మూకదాడులు, దాడులను ఎదుర్కొన్నారని, అదే సమయంలో హిందూ, క్రైస్తవ బాలికలు బలవంతపు మతమార్పిడులకు గురవుతూనే ఉన్నారని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ (USCIRF) చెబుతోంది.
జనాభాకు సంబంధించిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, పాకిస్థాన్‌లోని హిందూ మైనారిటీ తీవ్ర వివక్షను మరియు అభద్రతా భావాన్ని ఎదుర్కొంది.కేవలం గత దశాబ్ద కాలంలోనే, పాకిస్థాన్‌కు చెందిన అనేక హిందూ కుటుంబాలు మతపరమైన వేధింపులు, అభద్రతాభావం తో గడిపాయి. వేధింపులు, బలవంతపు మత మార్పిళ్లు, చిత్ర హింసల కారణంగానే తాము వలస వెళ్లుతున్నామని కూడా హిందువులు బహిరంగంగానే ప్రకటించారు.
పాకిస్తాన్ మానవ హక్కుల కమిషన్ (HRCP), మతపరమైన మైనారిటీలకు ఎదురవుతున్న బెదిరింపులను పదేపదే గుర్తు చేసింది కూడా. 2025 నివేదికలో సింధ్, పంజాబ్ లో హిందూ, క్రైస్తవ మహిళలు, బాలికలు బలవంతపు మత మార్పిళ్లకు, బాల్య వివాహాలకు గురవుతున్నారంటూ రిపోర్టులో పొందుపరిచింది.
వీటన్నింటినీ మరిచిపోయి, హిందువులను తాము సహిస్తున్నామని, వారు తమతోనే కలిసి జీవించి వుండడానికి ఇష్టపడుతున్నారని చెప్పడం చూస్తుంటే.. అక్కడి వాతావరణానికి ఏమాత్రం పొంతన లేదని స్పష్టంగా తెలిసిపోతోంది.





