News

మహిళలను గౌరవించడం ఇంటి నుంచే మొదలు కావాలి – డాక్టర్ మోహన్ భాగవత్

2kviews

హైదరాబాద్‌లో ఓ వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఉదంతం ఢిల్లీలో ఆదివారం జరిగిన అంతర్జాతీయ గీతామహోత్సవంలో ప్రతిధ్వనించింది. ఈ హేయమైన, అమానుషమైన కృత్యాన్ని ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్, సాధ్విరితంబర, చీఫ్ ఇమామ్ ఒమర్ అహ్మద్ ఇలియాసి, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సహా ప్రతీ ఒక్కరూ తీవ్ర పదజాలంతో ఖండించారు. ఈ రకమైన అమానుష కృత్యాలను అంతం చేయాలని, అందుకోసం ప్రతి ఒక్కరూ తమ వ్యక్తిత్వాన్ని, మహిళల పట్ల తమ ఆలోచనలను సరిదిద్దుకోవలసిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ గీతా సారాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటే కుటుంబంలోనూ, సమాజంలోనూ మహిళల పాత్ర ఏమిటో స్పష్టమవుతుందని అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ గ్యాంగ్ రేప్ ఉదంతాన్ని పరోక్షంగా ఆయన ప్రస్తావించారు. మహిళలను గౌరవించడం అన్నది ప్రతి ఒక్కరి ఇంటి నుంచే మొదలు కావాలని భగవత్ స్పష్టం చేశారు. మహిళల రక్షణ, భద్రతకు ప్రభుత్వం ఎన్నో చట్టాలను తీసుకుని వచ్చినప్పటికీ వాటి అమలు సవ్యంగా, సక్రమంగా జరిగినప్పుడే ఆశించిన ఫలితం లభిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమానికి హాజరైన లోక్‌సభ స్వీకర్ ఓం బిర్లా, హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, స్వామి జ్ఞానానంద, సాధ్వి రితంబరి తదితరులు

ప్రతి అంశాన్ని అలాగే ప్రతి బాధ్యతను ప్రభుత్వానికే వదిలి వేయడం ఎంత మాత్రం సమంజసం కాదని మహిళలను ఏ విధంగా గౌరవించాలన్న దానిపై పురుషుల్లో చైతన్యాన్ని తీసుకుని రావాలని ఈ రకమైన నడవడికను ఇంటి నుంచే అలవరచాలని ఆయన అన్నారు. ఆదివారం నాడిక్కడ గీతా మహోత్సవ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన మహిళల పట్ల అనుచితంగా, దురుసుగా, అవమానకరంగా ప్రవర్తించే ముందు తమకు చెలెళ్ళు, అక్కలు, కూతుళ్ళు, తల్లులు ఉన్నారన్న విషయాన్ని పురుషులు మరచిపోకూడదని అన్నారు. ఇంట్లో ఉన్న మహిళను సరైన రీతిలో గౌరవించినప్పుడే ఆ రకమైన మర్యాదపూర్వకమైన ప్రవర్తన కూడా బయట కూడా ఉంటుందని ఈ స్పృహను ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని ఆయన ఉద్ఘాటించారు. కరడు కట్టిన నేరస్థులకు సైతం తల్లులు, చెల్లెళ్ళు, అక్కలు ఉంటారని, వారే తమ జన్మకు కారణమన్న విషయాన్ని విస్మరించకూడదని అన్నారు. ఈ సందర్భంగా భగవద్గీత ప్రాధాన్యతను అందులోని శ్లోకాల పరమార్థాన్ని భగవత్ వివరించారు. భగవద్గీత కారణంగానే మానవాళికి అథ్యాత్మిక విజ్ఞానం సంక్షిప్త రూపంలో సిద్ధించిందని తెలిపారు. అన్ని ఉపనిషత్తుల సారాన్ని భగవద్గీత నిక్షిప్తం చేసుకుందని అర్జునుడికి మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు బోధించిందీ ఇదేనని భగవత్ తెలిపారు. ప్రతి ఒక్కరు తమ విధులను సక్రమంగా నిర్వర్తించడంతో పాటు అథ్యాత్మిక చింతనను అలవరుచకోవాలని పిలుపునిచ్చిన ఆయన ‘ఊర్వశి తన ముందు ప్రత్యక్షమైనా అర్జునుడు తన నైతిక వర్తనను వీడలేదు. పర స్త్రీ అయిన ఊర్వశిని తన తల్లిగానే భావించాడు. దీని అర్థం సమాజంలో మహిళలను అంతే గౌరవప్రదమైన రీతిలో పరిగణించాలన్నదే’ అని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎన్నో సవాళ్ళు ఉంటాయని, జయాలు, అపజయాలు అనేవి జీవనగమనంలో భాగాలేనని ఆయన తెలిపారు.

భగవద్గీత శ్లోకాలు చదివి వాటిని ఉర్దూలో వివరిస్తున్న ముస్లిం విద్యార్థులు

ఈ రకమైన ప్రతికూల పరిస్థితులను, సవాళ్ళను అధిగమించి ప్రతి ఒక్కరూ తమను తాము తీర్చిదిద్దుకోవాలో భగవద్గీత స్పష్టం చేస్తుందన్నారు. మానవ జీవితంలో ఎదురయ్యే ప్రతి నష్టం, కష్టం సవాలును ఎదుర్కొనేందుకు భగవద్గీత మార్గనిర్ధేశన చేస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమకు నిర్ధేశించిన కర్తవ్యంలో నిమగ్నం కావాలని, ఇలా లేని పక్షంలో వ్యక్తుల ఆలోచనలు తప్పుదారే పడతాయన్నారు. భగవద్గీత మూల సారాన్ని అర్థం చేసుకుంటే అందులోని ప్రధాన అంశం భయాన్ని వీడడమేని భగవత్ తెలిపారు.

మరిన్ని జాతీయఅంతర్జాతీయ వార్తలువిశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.