
ఈ ఏడాది (2019) 7, 8 తారీఖులలో విజయవాడలోని సిద్ధార్థ నగర్ లో గల సిద్ధార్థ అకాడమీ నందు ‘సేవా సంగమం’ నిర్వహించనున్నామని సేవా భారతి రాష్ట్ర సంఘటనా కార్యదర్శి శ్రీ కాకాణి పృథ్వీరాజు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీ పృథ్వీరాజు మాట్లాడుతూ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి సేవా భారతి రాష్ట్ర మరియు అఖిలభారత స్థాయిలలో “ సేవా సంగమం” (స్వచ్ఛంద సేవా సంస్థల సమ్మేళనము) నిర్వహించుకుంటూ ఉన్నదని తెలిపారు. సమాజంలోని అనేకమంది వ్యక్తులు, సంస్థలు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని, వారందరినీ ఒక చోట కలిపి వారి అనుభవాలను పంచుకుని, వారితో కలిసి సంస్థ యొక్క సామర్ధ్యాన్ని పెంపొందించుకోవడానికి, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదమూడు వందల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న సేవాభారతి అనుభవాలను వారికి వివరించి మార్గదర్శనం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించామని శ్రీ పృథ్వీరాజు వెల్లడించారు.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క సేవా విభాగమైన సేవా భారతి, ఆంధ్రప్రదేశ్లో 200 పడకల ఆసుపత్రి నుండి మారుమూల గ్రామాలకు నడిచి వెళ్లి వైద్య సేవలు అందించే ‘ఆరోగ్య మిత్ర’ల వరకు అనేక వైద్య సేవలు అందిస్తున్నదని తెలిపారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అనాథ బాలుర వసతి గృహాలు, కుష్టు రోగి ఆరోగ్య కేంద్రాలు వంటివి నిర్వహిస్తున్నామన్నారు. అనేక మురికివాడలలో సాయంత్ర విద్యా కేంద్రాలు నిర్వహించడంతోపాటు పిల్లలకు కంప్యూటర్ లో శిక్షణ, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు, గ్రామాలలో ఆధ్యాత్మిక వికాసం కోసం భజన మండలి, ఆరోగ్య వికాసం కోసం యోగ కేంద్రాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సేవా సంగమంలో అనేక స్టాల్స్, చిత్ర ప్రదర్శనలు ఆకర్షణగా నిలవనున్నాయని తెలిపారు.

ఈ సమావేశంలో సేవా భారతి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ సాయి కిషోర్, సేవా భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి పత్తి నాగలక్ష్మిలు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సేవా సంగమం కార్యక్రమం యొక్క గోడ పత్రిక (పోస్టర్)ను, కరపత్రాన్ని కూడా వారు విడుదల చేశారు.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





