ArticlesNews

కాలజ్ఞాన కృతికర్త..సంఘ సంస్కర్త..శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి

325views

( శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి )

ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, సామాజిక చైతన్యాన్ని సమన్వయ పరచిన సంస్కర్త, తత్వబోధకుడు వీరబ్రహ్మేందులు. పారమార్థిక మార్గంలో సమాజ అభ్యున్నతి కోసం పాటుపడ్డ ప్రబోధకుడాయన. ఆ బోధనలు ప్రజల పాలిట దైవవచనాలు. బాల్యంలోనే కాళికాదేవిని పూజించి.. స్తుతిగేయాలు రచించిన మహాభక్తుడు. ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది, లోకంలో ఆరాధ్యనీయుడిగా చిరస్థాయిగా నిలిచిపోయాడు.

‘బ్రహ్మంగారు’గా ప్రసిద్ధులైన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి అక్షరజ్ఞానం లేనివారికి సైతం ఆత్మజ్ఞానాన్ని బోధించిన వేదాంతి. మతాలు, మనుషుల మధ్య సంఘర్షణల్ని రూపుమాపి, సామరస్యాన్ని పెంచాలని తపించిన సంస్కరణాభిలాషి. వీరబ్రహ్మం అనగానే అందరి మనసుల్లో మెదిలేది ‘కాలజ్ఞానం’. నోస్ట్రడామస్, మదర్‌ షిప్టన్‌ వంటి పాశ్చాత్యుల్లా.. దక్షిణాది మహాజ్ఞానులు విద్యారణ్య, చెన్నబసవల్లా కాలజ్ఞానాన్ని చెప్పిన త్రికాలవేది వీరబ్రహ్మేంద్ర స్వామి. జ్ఞానిగా, యోగిగా, గృహస్థ సాధకుడిగా, విరాగిగా బ్రహ్మంగారు భక్తుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్నారు. సర్వసంగపరిత్యాగులకే కాదు సాంసారిక జీవనంలో కొనసాగుతున్నవారికి కూడా సద్గురువై దారిచూపారు. ‘మతాల్లో తప్పుల్లేవు! ఆచరించే మనసుల్లోనే దోషాలున్నాయి’ అని ఘంటాపథంగా చాటారు. మత నియమాల కన్నా మానవ విలువలకే ప్రాధాన్యం ఇచ్చారు. బ్రహ్మంగారు మఠాలు స్థాపించారు. పారమార్థిక ప్రవచనాలు, చైతన్యపూరిత రచనలతో జనావళిని జాగృతం చేశారు. ఆయన కాలజ్ఞానానికే పరిమితం కాదు. నిరాడంబర తపోజీవనం, కఠోర సాధన, ధ్యానకౌశలం, సామాజిక సంస్కరణ, తత్త్వబోధ, మత సామరస్యం, ధార్మిక రచనలు ఇలా ఆయనలో ఎన్ని కోణాలో!

కర్ణాటక ప్రాంతాన క్రీస్తుశకం1608లో జన్మించిన వీరబ్రహ్మేంద్రుల వారి జయంతిని ప్రతి ఏటా మే 26న జరుపుకుంటున్నాము. వీరబ్రహ్మంగారు తన బాల్యంలోనే కన్నవారిని కోల్పోయారు. పెంచిన తండ్రి కూడా చిన్నతనంలోనే దూరమయ్యారు. పెంపుడు తల్లి వీరపాపాంబ ప్రాణసమానంగా పెంచింది. బతుకు కష్టాలు భగవంతుని వైపు మరల్చాయి. కాళీమాత ఆరాధకుడై బాల్యంలోనే వేదాంత జ్ఞానాన్ని పొందారు. ఆర్జించిన ఆత్మజ్ఞానాన్ని తొట్టతొలుత పెంచిన తల్లికే పంచి, ఆమె రుణం తీర్చుకున్నారు. పారమార్థిక పర్యటనల్లో భాగంగా కర్నూలులోని పోతులూరు గ్రామం చేరుకున్నారు. తన జ్ఞానాన్ని బయటపడనీయక.. వీరప్పయ్య పేరుతో గరిమిరెడ్డి అచ్చమ్మ వద్ద పశువుల కాపరిగా కుదిరారు. బనగానపల్లె సమీపంలోని రవ్వలకొండపై గుహలో తపోధ్యానాలను సాగించేవారు. తాటాకులపై కాలజ్ఞానాన్ని రాస్తూ, ఆ పత్రాలను అచ్చమ్మ ఇంట్లో దాచేవారు. అవన్నీ గమనించి ఆయన శిష్యురాలైంది. ఆ గుహల్లో ఆయన అచ్చమ్మకు కాలజ్ఞానం బోధించారు. అలా వీరప్పయ్య వీరబ్రహ్మేంద్రస్వామిగా ప్రసిద్ధులయ్యారు. రవ్వలకొండలో కాలక్రమాన బ్రహ్మంగారి దేవాలయం వెలసింది. బనగానపల్లెలో ఆయన రచించిన 14000 కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై చింతచెట్టును పెంచి పూజించటం విశేషం.

వీరబ్రహ్మేంద్రులు గోవిందమ్మ అనే యువతిని వివాహం చేసుకున్నారు. దాంపత్య జీవనంలోనూ ఆధ్యాత్మిక సాధనలు కొనసాగించారు. ఆదర్శ గృహస్థధర్మాన్ని పాటిస్తూ సంతానాన్ని కూడా పారమార్థిక పథంవైపు మరలించారు. చివరికి కడప జిల్లా కందిమల్లయ్యపల్లె గ్రామంలో స్ధిరపడ్డారు. జీవనోపాధి కోసం వడ్రంగం వృత్తి చేస్తూ లోకులకు ఆత్మజ్ఞానం బోధించేవారు. వేమనపై ప్రత్యేక గౌరవంతో అనేక పద్యాల్లో ఆయనను కీర్తించారు. కాలజ్ఞానంతోపాటు జీవైక్య బోధ, సిద్ధార్థ శతకం, వీర కాళికాంబా శతకం, కాళికాంబా సప్తశతి తదితర గ్రంథాలెన్నో రచించారు.

వీరబ్రహ్మేంద్రులు తన రచనల్లోనే కాదు.. జీవితంలోనూ స్త్రీలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. తల్లి వీరపాపాంబకు పూజ్యస్థానాన్నిచ్చారు. అర్ధాంగి గోవిందమ్మను ఎంతో గౌరవించేవారు. ఆమె అనుమతితోనే లోకసంచారానికి వెళ్లారు, ఆమె అంగీకారంతోనే సజీవ సమాధిలో ప్రవేశించారు. ‘వైధవ్యం’ పేరిట జరిగే దురాచారాల్ని నిరసిస్తూ, భార్యను కుంకుమ, పసుపు, గాజులు తీయకుండా నిత్యసుమంగళిగానే ఉండమన్నారు. కుమార్తె వీరనారాయణమ్మను జ్ఞానమార్గంలో పయనింపజేశారు. కందిమల్లయ్యపల్లెలో స్థాపించిన మఠానికి మనవరాలు ఈశ్వరమ్మను వారసురాలిగా ప్రకటించి ఆధ్యాత్మిక పురోగతికి మహిళలూ అర్హులేనని తెలియజేశారు.

షేక్‌సాహెబ్‌ అనే పదిహేనేళ్ల యువకుడు వీరబ్రహ్మేంద్రస్వామిని ఆశ్రయించాడు. బ్రహ్మంగారు అతనికి బ్రహ్మోపదేశం చేసి సిద్ధయ్య అనే దీక్షానామం ఇచ్చి, సాంఖ్యయోగం బోధించారు. కాలాంతరంలో ఈ సిద్ధయ్య ఆదర్శశిష్యుడిగా ఎదిగాడు. గురువు మాటను అక్షరాలా పాటించేవాడు. వారి అనుబంధాన్ని బట్టి వీరబ్రహ్మాన్ని పోలిన గురువు, సిద్ధయ్యను మించిన శిష్యుడు లేడనే మాట వ్యాప్తిచెందింది. మతసామరస్యం పారమార్థిక ఉన్నతికి నిదర్శనమని ఆచరణలో చూపిన బ్రహ్మంగారు బనగానపల్లె నవాబు మహ్మద్‌ బేగ్‌ఖాన్‌కు జ్ఞానోదయం కలిగించారు. మతాల పేరుతో మనుషుల్ని వేరు చేయటం అజ్ఞానమని ఉద్ఘాటించారు. వీరబ్రహ్మం ఎనబై అయిదో ఏట వైశాఖ శుద్ధ దశమినాడు సజీవసమాధిలోకి ప్రవేశించారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఆధ్యాత్మిక సాధనలకు ఈ ప్రదేశం అనువైందని ఆధ్యాత్మికవేత్తల భావన.