
భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దాయాదితో చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయాలని న్యూదిల్లీ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. దీనిపై పాక్ నేతలు స్పందిస్తూ పలుమార్లు భారత్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. తాజాగా పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ భారత్‌పై ప్రేలాపనలు పేలారు. పాక్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అహ్మద్ షరీఫ్ ప్రసంగిస్తూ..‘‘భారత్ మాకు వచ్చే నీటిని అడ్డుకుంటే అక్కడి ప్రజల ఊపిరి ఆపేస్తాం. సింధూ నదిలో జలాలకు బదులుగా వారి రక్తం పారుతుంది’’ అని అన్నారు.
ఆయన వ్యాఖ్యలను అఫ్ఘాన్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మరియం సోలైమాంఖిల్ తీవ్రంగా ఖండించారు. దేశానికి చెందిన ఓ సైనికాధికారి ఇలా మాట్లాడటం సరైన చర్య కాదని అన్నారు. లష్కరే తయ్యిబా చీఫ్ హఫీజ్ సయీద్ సింధూ నది గురించి మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారని అన్నారు. ‘‘కశ్మీర్‌లో డ్యాం నిర్మించడం ద్వారా పాక్‌కు నీళ్లు ఆపేస్తామని మీరంటున్నారు. పాక్‌ను నాశనం చేయాలని, చైనా-పాకిస్థాన్ ఆర్థిక నడవా ప్రణాళికలను విఫలం చేయాలని కోరుకుంటున్నారు. కానీ మీరు నీళ్లు ఆపేస్తే.. నదుల్లో మళ్లీ రక్తం పారుతుంది’’ అని అతడు అన్నాడని గుర్తు చేశారు. పాక్ అధికారులు అక్కడి ఉగ్రవాదుల స్క్రిప్ట్‌ను చదువుతున్నట్లు ఉందని పేర్కొన్నారు.
పాక్ రక్షణ మంత్రి సైతం ఇటీవల ఈ విషయంలో భారత్‌పై నోరు పారేసుకున్నారు. సింధూ నది తమదేనని, ఆ నాగరికతకు నిజమైన సంరక్షకులం తామేనంటూ భారత్‌పై అక్కసు వెళ్లగక్కారు. గతంలో లష్కరే తయ్యిబా ఉగ్రవాది సైతం ఇవే వ్యాఖ్యలు చేయడం గమనార్హం.





