News

‘ఆపరేషన్‌ సిందూర్‌’ ఉగ్రవాదానికి దీటైన జవాబు: అమిత్‌ షా

232views

పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ జరిపిన ఆపరేషన్‌ సిందూర్‌ ఉగ్రవాదానికి దీటైన జవాబు అని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. పహల్గాం దాడులతో అన్ని హద్దులూ దాటిన ఉగ్రవాదులను పూర్తిగా నిర్మూలించడానికి.. వారి స్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసిందన్నారు. పాక్‌లో ఉన్న ఉగ్రస్థావరాలను భారత్‌ బయటపెట్టడంతో.. ఆ దేశం ఉగ్రవాదులను పోషిస్తుందనే నిజం మరోసారి ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ను ప్రపంచమంతా కొనియాడిందని షా పేర్కొన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ బలమైన రాజకీయ సంకల్పం.. నిఘా సంస్థలు అందించిన కచ్చితమైన సమాచారం.. త్రివిధ దళాల అద్భుత ప్రదర్శన వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతం అయ్యిందని అమిత్‌ షా అన్నారు. పాక్‌.. భారత్‌పై క్షిపణులు ప్రయోగించిన సమయంలో దేశాన్ని కాపాడడంలో బీఎస్‌ఎఫ్‌ దళాలు ముఖ్యపాత్ర పోషించాయని అమిత్‌ షా అన్నారు. బంగ్లాదేశ్‌తో సహా అంతర్జాతీయ సరిహద్దులను కాపాడటంలో బీఎస్‌ఎఫ్ పాత్రను అభినందించారు. పాకిస్థాన్‌ చేస్తున్న తప్పిదాల వల్ల భారత్‌ అనేక దశాబ్దాలుగా ఉగ్ర సమస్యను ఎదుర్కొంటుందని పేర్కొన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి భారత్‌ ఉగ్ర దాడులకు గట్టి బదులిస్తోందని అన్నారు. పహల్గాం ఘటన సమయంలో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ చంపడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు.

ఆపరేషన్ సిందూర్‌లో 9 ఉగ్రవాద స్థావరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని.. వాటిలో 2 వాటి ప్రధాన ఉగ్ర కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. అయితే ఈ దాడిలో పాక్‌ ప్రజలకు గానీ, సైనిక స్థావరాలకు గానీ ఎటువంటి నష్టం కలిగించలేదని స్పష్టంచేశారు. కానీ పాక్‌ సైన్యం మాత్రం నిషేధిత ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై.. ఉగ్రవాదానికి మద్దతు పలికారని అమిత్‌షా అన్నారు. వారి చర్యలను ప్రపంచం మొత్తం చూసిందని.. ఉగ్రవాదుల వెనక ఎవరు ఉన్నారనే విషయం అన్ని దేశాలకు అర్థమయ్యిందని తెలిపారు. 1965 నుంచి నేటివరకు దేశ ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలు అర్పించిన 2,000 మందికి పైగా సరిహద్దు గార్డులకు దేశం తరఫున నివాళులర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.