తిరుమల డౌన్ ఘాట్ రోడ్డులో 7వ కిలోమీటర్ వద్ద ఉన్న శ్రీ ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో జరిగిన విగ్రహం అపహరణ ఘటనను తిరుపతి జిల్లా పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విగ్రహాన్ని స్వాధీనం చేసుకోవడం పట్ల రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
ఘటన జరిగిన వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారాన్ని సమర్థవంతంగా వినియోగించి కేసును వేగంగా ఛేదించిన తిరుపతి జిల్లా ఎస్పీ, దర్యాప్తు బృందాలు, టీటీడీ విజిలెన్స్ అధికారులను మంత్రి అభినందించారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని ముందుగానే గుర్తించడంలో టీటీడీ విజిలెన్స్ కీలక పాత్ర పోషించింది. నిందితుడి కదలికలు, ప్రయాణ వివరాలు, ఫోన్ నంబర్ వంటి కీలక సమాచారాన్ని సాంకేతికంగా గుర్తించి వెంటనే పోలీసులకు అందించడంతో దర్యాప్తు వేగవంతమైందని పేర్కొన్నారు.
అలాగే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన AI ఆధారిత ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) ద్వారా లభించిన నిఘా సమాచారం, సాంకేతిక ఆధారాలు కూడా కేసు ఛేదింపులో కీలకంగా ఉపయోగపడ్డాయని మంత్రి వెల్లడించారు. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించడం వల్లే కేసును అత్యంత వేగంగా పరిష్కరించడం సాధ్యమైందన్నారు.
తిరుమల వంటి మహా పుణ్యక్షేత్రంతో పాటు రాష్ట్రంలోని ఏ ఆలయంలోనైనా దేవతా విగ్రహాలపై దుశ్చర్యలకు పాల్పడితే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదని మంత్రి స్పష్టం చేశారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తిరుమలతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాలు, ఉపాలయాలు, ఘాట్ రోడ్లు, పరిసర ప్రాంతాల్లో భద్రతను మరింత పటిష్ఠం చేయాలని సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు వెల్లడించారు. నిఘా వ్యవస్థను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత బలోపేతం చేయనున్నట్లు పేర్కొన్నారు.





