
కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని సేవల్లో వైదిక బృందం, అధికారుల మధ్య సమన్వయ లోపం కనిపిస్తోంది. ఇటీవల సత్యదేవుని కల్యాణోత్సవాల్లో వనదుర్గ అమ్మవారి ఆలయంలో చండీ, ప్రత్యంగిర హోమాలు నిలుపుదల చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు స్వామివారికి నిత్యం చేసే సుప్రభాతసేవ, ప్రాకారసేవలపై వైదిక బృందం ఇటీవల లిఖితపూర్వకంగా ఇచ్చిన సూచనలు కూడా చర్చకు తావిచ్చాయి. వైదిక కార్యక్రమాల నిర్వహణలో అధికారుల ఒత్తిడి ఏమైనా ఉంటుందా.. వైదిక బృందమే మార్పులు చేస్తున్నారా.. స్వామి కార్యక్రమాలు ఏటా ఎందుకు మారుతున్నాయన్న అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతుంది.
సుప్రభాత సేవ రద్దు చేస్తారా..
స్వామివారి సుప్రభాత సేవను తెల్లవారుజామున రెండు గంటలకు ముందు నిర్వహించాల్సి వస్తే రద్దు చేయాలని, శని, ఆది, పర్వదినాల్లో జరిగే ప్రాకారసేవ సాయంత్రం చేయాల్సి వస్తే దీనిని కూడా రద్దు చేయాలని వైదిక కమిటీ లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చింది. వీటిపై శృంగేరీ పీఠం నుంచి అభిప్రాయం తీసుకోవాలని ప్రస్తుతం నిర్ణయించారు. అక్కడ నుంచి ఎటువంటి సూచనలు వస్తాయన్న అంశం ఆసక్తికరంగా మారింది. దేవస్థానంలో ముగ్గురు పండితులు, ఇద్దరు అర్చకులు, ఒక పురోహితుడితో వైదిక కమిటీ ఉంది. ప్రస్తుతం మరో పండితుడు, పురోహితుడిని కూడా కమిటీలో చేర్చారు.





