
సద్గుణాలన్నింటినీ పోగుచేసి రాశిగా పోస్తే అందులో మనకు సాక్షాత్కరించేది శ్రీరామచంద్రుడి దివ్య మంగళ స్వరూపమేనంటారు రాముడి గుణగణాలను అధ్యయనం చేసిన జ్ఞానులు. సద్గుణనిధి కాబట్టే తరతరాలుగా భారతీయులందరికీ శ్రీరామచంద్రుడే ఆదర్శ పురుషుడు అయ్యాడు.
సమాజంలో ఓ వ్యక్తి ఉత్తముడిగా జీవించాలంటే అతడికి స్ఫూర్తినిచ్చేవారు ఉండాలి. ఆ స్ఫూర్తిప్రదాతల కోసం ఎక్కడో వెతకనక్కరలేదు. పూర్ణపురుషుడైన శ్రీరామచంద్రుడే మనకు చక్కటి ఉదాహరణ.
మనిషి ఆదర్శవంతుడిగా ఉండాలంటే కష్టనష్టాలను సమర్థంగా ఎదుర్కొనగలగాలి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి, ఉద్యోగ, వ్యాపారాల తాలూకు ఒత్తిళ్లకు లోనవుతున్న నేటి యువతకు రాముడి స్ఫూర్తి చాలా అవసరం. వ్యక్తి ఓ లక్ష్యం దిశగా ముందుకు సాగాలంటే దృఢచిత్తం, ఏకాగ్రత, సహనం అనేవి చాలా ముఖ్యం. ఈ సుగుణత్రయాన్ని తన సొంతం చేసుకున్న నిండు మనీషి కాబట్టే రామచంద్రుడు జన హృదయంలో ఆదర్శమూర్తిగా నిలిచిపోయాడు.
శ్రీమద్రామాయణం కాలక్షేపానికి చెప్పుకొనే కథ కాదు. అక్షరాలా జరిగింది కనుకనే అది జనజీవనసారం అనిపించుకుంది. భిన్న గుణగణాలను చాటే రామాయణ పాత్రలు మానవాళికి ఓ సందేశాన్ని అందిస్తాయి. ప్రజలంతా సుభిక్షంగా, సుఖశాంతులతో ఉంటే దాన్ని ‘రామరాజ్యం’ అంటారు. రాముడు సద్గుణ సంపన్నుడు. ఆ గుణ సంపదే ఆయనను దేవుడిగా పూజనీయ స్థానంలో కూర్చోబెట్టింది. ధర్మ పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం- రాముడు. ప్రియమైన కుమారుడిగా, ఏకపత్నీవ్రతుడిగా, ఉత్తమ పాలకుడిగా కీర్తి ప్రతిష్ఠలు అందుకున్న సర్వోత్తముడు. తండ్రి మాటను శిరసావహించి పెద్దలను గౌరవించాలన్న సందేశాన్ని ప్రజలకు అందించాడు. సోదరులతో అన్యోన్యంగా ఉంటూ అన్నదమ్ములు ఎలా ఉండాలో చూపించాడు. ప్రజారంజకంగా పాలన సాగిస్తూ అందరినీ సమదృష్టితో చూస్తూ భావి పాలకులకు పాఠాలు చెప్పాడు.
విలాసాలు, విశృంఖలత్వం, విపరీత ధోరణులతో అయోమయ స్థితికి చేరుకుంటున్న ఈనాటి యువతకు దిశానిర్దేశం చేసే కథ శ్రీరాముడిది. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మనసుపెట్టి రామాయణ గాథపైకి దృష్టి మళ్లిస్తే మంచి మార్గం తప్పకుండా కనబడుతుంది. రాముడు తండ్రి ఆనతి మేరకు అడవులకు వెళ్లాడు. అందుకు కారకులైన కైకేయి, మంధరలపై ఎలాంటి ఆగ్రహం చూపలేదు. ఆగ్రహం, ఆవేశం మదిలో రగిలాయంటే అవి ఎండిన కర్రకు అంటిన నిప్పులా ఆ వ్యక్తినే కాల్చి మసి చేస్తాయి. అదే రాముడి హెచ్చరిక. ఆధ్యాత్మికత, విజ్ఞానం, చక్కటి కుటుంబ వ్యవస్థ, సామాజిక ఐక్యత మొదలైనవన్నీ కలగలిసిన రామాయణ గాథ కాలాతీతమైనది. శ్రీమద్రామాయణ కావ్యాన్ని ఏ కోణంలో చూసినా, లోతులకు వెళ్లి విశ్లేషించుకున్నా అంతా మంచే కనబడుతుంది. రామయ్య నడిచిన బాటలో నడిస్తే అంతా ఆనందమయం, మంగళకరం!





