News

తొలిసారి హనుమాన్‌ గఢీని దాటిన మహంత్‌ ప్రేమ్‌దాస్‌

263views

మూడు వందల సంవత్సరాల చరిత్రలో తొలిసారి అయోధ్యలోని ప్రసిద్ధ హనుమాన్‌ గఢీ ఆలయ ప్రధాన అర్చకుడు కోవెల ప్రాంగణాన్ని దాటి బయటకొచ్చారు. అక్షయ తృతీయను పురస్కరించుకుని బుధవారం ఆ ఆలయ ప్రధాన అర్చకుడు మహంత్‌ ప్రేమ్‌దాస్‌ హనుమాన్‌ గఢీ ప్రాంగణం నుంచి బయటకు వచ్చి రథంపై ఊరేగింపుగా అయోధ్యలోని రామాలయానికి బయలుదేరారు. శతాబ్దాలుగా వస్తున్న పూర్వ ఆచారాల ప్రకారం హనుమాన్‌ గఢీ ప్రధాన పూజారి తన జీవితాంతం ఆలయ ప్రాంగణాన్ని వీడకూడదు. బుధవారం మహంత్‌ ప్రేమ్‌ దాస్‌ నూతనంగా నిర్మించిన పవిత్ర ఆలయానికి వెళ్లి బాలరాముడిని దర్శించుకున్నారు.

ఈ భారీ ఊరేగింపునకు వేలాది నాగసాధువులు, ఆయన శిష్యులు, భక్తులు హాజరయ్యారు. ఊరేగింపులో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలతోపాటు స్థానిక బృందాల సంగీత ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మహంత్‌ ప్రేమ్‌ దాస్‌తోపాటు భక్తులు ఆలయ సందర్శనకు ముందు మొదట సరయూ నదీతీరంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఒక్కసారి హనుమాన్‌ గఢీ ఆలయ ప్రధాన అర్చకుడి పీఠం అధిరోహించిన తర్వాత జీవితాంతం హనుమాన్‌ సేవలోనే తరించాలని, మరణించేంత వరకూ ఆలయ ప్రాంగణంలోనే ఉండాలని అఖాడా ప్రధాన మహంత్‌ రామ్‌కుమార్‌ దాస్‌ తెలిపారు. ఈ ఆచారం 1731వ సంవత్సరం నుంచి, అంటే.. 288 ఏళ్లుగా వస్తుందని వివరించారు. అయితే, రామాలయాన్ని సందర్శించాలన్న ప్రబలమైన కోరికను మహంత్‌ ప్రేమ్‌ దాస్‌ వ్యక్తం చేయడంతో నిర్వాణీ అఖాడీ సభ్యులు అందుకు అనుమతి మంజూరు చేసినట్లు చెప్పారు.