
దేవస్థానాల్లో గోశాలల నిర్వహణ కేవలం పశుసంరక్షణకే పరిమితం కాకుండా, సనాతన ధర్మం, గోసంరక్షణ, ఆధ్యాత్మిక విలువలకు ప్రతీకగా నిలుస్తుందని రాష్ట్ర దేవాలయ పాలనా సంస్థ (సిటా) డైరెక్టర్, మాజీ దేవదాయశాఖ కమిషనర్ ఎన్. ముక్తేశ్వరరావు అన్నారు. నిరంతర పర్యవేక్షణ, శాస్త్రీయ నిర్వహణ ద్వారానే గోవుల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఆదర్శ గోశాలలను తీర్చిదిద్దవచ్చని సూచించారు.
దేవదాయశాఖ, సిటా సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో ఆదర్శ గోశాలల నిర్వహణ, శాస్త్రీయ పశుసంరక్షణ విధానాలపై మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని గురువారం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. రాష్ట్రంలోని సుమారు 26 ప్రముఖ దేవస్థానాల నుంచి ఎంపికైన సిబ్బందికి గోశాల నిర్వహణ, పశుపోషణ, ఆరోగ్య సంరక్షణ, సంప్రదాయ విలువల పరిరక్షణ తదితర అంశాలపై నిపుణులు శిక్షణ అందించనున్నారు.
ఈ సందర్భంగా ఎన్. ముక్తేశ్వరరావు మాట్లాడుతూ, ఈ శిక్షణ ద్వారా ఆలయ గోశాలల అభివృద్ధి, గోవుల సంరక్షణలో నాణ్యత పెంపు, సనాతన సంప్రదాయాల పరిరక్షణకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో సిటా డిప్యూటీ డైరెక్టర్ ఎంవీఎస్‌ఎస్ విష్ణుప్రసాద్, దేవస్థానం ఈవో వి. త్రినాథరావు, డాక్టర్ జి. విజయకుమార శర్మ, డాక్టర్ కె. శివసాగర్‌రెడ్డి, డాక్టర్ సీహెచ్. గౌతమ్‌వర్మతో పాటు పలు దేవాలయాల గోశాలల్లో సేవలందిస్తున్న గోపాలకులు, క్లర్కులు, పర్యవేక్షకులు పాల్గొన్నారు.




