
భారత రాజకీయ చరిత్రలో అత్యంత వివాదాస్పదంగా భావించే ‘జాతీయ అత్యవసర పరిస్థితి’ (ఎమర్జెన్సీ) విధించి 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) కీలక నిర్ణయం తీసుకుంది. తొమ్మిదో తరగతి సామాజిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో ఎమర్జెన్సీకి సంబంధించిన పాఠాన్ని ప్రవేశపెట్టింది. ఈ అత్యవసర పరిస్థితిని భారత ‘ప్రజాస్వామ్యానికి ఎదురైన అతిపెద్ద అంతర్గత సవాళ్లలో ఒకటి’గా ఈ పాఠ్యాంశంలో చెప్పుకొచ్చింది. ఎన్‌సీఈఆర్‌టీ రూపొందించిన కొత్త సామాజిక శాస్త్ర పుస్తకం ‘అండర్‌స్టాండింగ్ సొసైటీ: ఇండియా అండ్ బియాండ్’లోని ఓ అధ్యాయంలో భారత ప్రజాస్వామ్య బలాలు, సవాళ్లను విశ్లేషిస్తూ ఈ ఎమర్జెన్సీ విభాగాన్ని చేర్చినట్లు ఎన్‌సీఈఆర్‌టీ అధికారి ఒకరు అధికారికంగా ధృవీకరించారు.
ఇంతకీ పాఠ్యపుస్తకంలో ఏముందంటే!
1975 నుంచి 1977 వరకు దేశంలో కొనసాగిన అత్యవసర పరిస్థితి విధించడానికి దారితీసిన పరిస్థితులను ఈ పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ వివరించింది. ఆ సమయంలో దేశాన్ని పీడించిన తీవ్ర నిరుద్యోగ సమస్య, అదుపులేకుండా పెరిగిన ద్రవ్యోల్బణం, ప్రభుత్వ దుష్పరిపాలన వంటి అంశాలు ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యాయని పుస్తకంలో పేర్కొంది. ఈ పరిణామాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ ఎత్తున ప్రజా నిరసనలు, ఉద్యమాలు వెలువెత్తాయని వెల్లడించింది. ఎమర్జెన్సీ కాలంలో దేశంలో నెలకొన్న తీవ్రమైన పరిస్థితులను, రాజ్యాంగ ఉల్లంఘనలను ఈ పాఠ్యాంశంలో పొందుపర్చింది. ఎమర్జెన్సీ 21 నెలల కాలంలో భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యధిక ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేసినట్లు, ప్రజాస్వామ్యానికి జీవనాడి లాంటి పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేసింది.
జయప్రకాశ్ నారాయణ్ పోరాటం గురించి
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ‘లోక్‌నాయక్’గా యావత్ భారతదేశ ప్రజల గుండెల్లో నిలిచిన ప్రముఖ సోషలిస్టు నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ నడిపించిన చారిత్రక ప్రజా ఉద్యమానికి ఎన్‌సీఈఆర్‌టీ ఈ పుస్తకంలో ప్రత్యేక స్థానం కల్పించింది. ముఖ్యంగా బిహార్, గుజరాత్ రాష్ట్రాల్లో విద్యార్థులను, సామాన్య పౌరులను ఆయన ఏ విధంగా ఏకం చేశారో, వ్యవస్థలోని అవినీతికి వ్యతిరేకంగా ఎలా ఉద్యమించారో వివరించింది. 1977లో ఎమర్జెన్సీని ఎత్తివేసిన తర్వాత దేశంలో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ప్రాధాన్యతను కూడా ఎన్‌సీఈఆర్‌టీ వెల్లడించింది. ఆ ఎన్నికల్లో భారత ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా అత్యంత శక్తివంతమైన తీర్పును ఇచ్చారని, అప్పటి వరకు దేశాన్ని ఏలిన అధికార పక్షాన్ని ఘోరంగా ఓడించారని పేర్కొంది. ఈ చారిత్రాత్మక ఓటమి భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అసలైన బలాన్ని, పటిష్టతను ప్రపంచానికి చాటిచెప్పిందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో నిరూపించిందని విశ్లేషించింది.
గతంలో జరిగిన ఎమర్జెన్సీని మాత్రమే కాకుండా, ప్రస్తుత కాలంలో అంతర్జాతీయంగా, దేశీయంగా ప్రజాస్వామ్య వ్యవస్థల మనుగడకు ముప్పుగా మారుతున్న పలు ఆధునిక సవాళ్లను కూడా ఈ అధ్యాయంలో ఎన్‌సీఈఆర్‌టీ చేర్చింది. సోషల్ మీడియా యుగంలో తప్పుడు సమాచారం, తప్పుదోవ పట్టించే వార్తలను గురించి వివరించింది. నిరసనల పేరుతో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను నాశనం చేయడం, పౌర నియమాలను ఉల్లంఘించడం సమాజానికి ఎలా నష్టమో స్పష్టం చేసింది. దేశ పురోగతికి అడ్డుగా నిలుస్తున్న పేదరికం, ప్రాంతీయవాదం, సామాజిక వివక్ష, లింగ అసమానతలు ప్రజాస్వామ్యానికి ప్రధాన సవాళ్లుగా చెప్పింది.
భారత ప్రజాస్వామ్య విస్తృతిని విద్యార్థులకు మరింత అర్థమయ్యేలా చెప్పేందుకు కొన్ని ఆసక్తికర గణాంకాలను కూడా ఇచ్చారు. 2024 నాటికి దేశంలో 96.8 కోట్ల మంది నమోదిత ఓటర్లు ఉన్నారని, దేశవ్యాప్తంగా ఉన్న విస్తృత పోలింగ్ కేంద్రాల నెట్‌వర్క్ గురించి ప్రస్తావించారు. అలాగే, క్షేత్రస్థాయి ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా గుజరాత్‌లోని ఒక పంచాయతీని, త్రిపురలోని మహిళా సానుకూల పంచాయతీని కేస్ స్టడీలుగా చేర్చారు. స్థానిక సంస్థల్లో మహిళల ఓటు హక్కులు, వారికి కల్పించిన రిజర్వేషన్ల గురించి కూడా ప్రత్యేక విభాగంలో వివరించారు.




