News

అయోధ్య రాముడికి ముస్లిం మహిళల హారతి

289views

రామ నవమి పర్వదినాన ముస్లిం మహిళలు అయోధ్య రాముడికి హారతి ఇచ్చి మత సామరస్యాన్ని చాటారు. అనంతరం వక్ఫ్‌ సవరణ బిల్లుకు తమ మద్దతు తెలియజేశారు. వారణాసిలోని ముస్లిం ఉమెన్‌ ఫౌండేషన్, విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అందమైన రంగోలి వేశారు. గత 19 సంవత్సరాలుగా వారణాసిలోని ముస్లిం మహిళలు రామనవమి నాడు శ్రీరాముడికి హారతి ఇస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ముస్లిం ఉమెన్‌ ఫౌండేషన్‌ జాతీయ అధ్యక్షురాలు నజ్నియన్‌ అన్సారీ మాట్లాడారు. ముస్లిం మహిళలు శ్రీరామునికి హారతి ఇచ్చారని, ఉర్దూలో రాసిన రామ్‌ హారతి పాట పాడారని చెప్పారు. అనంతరం జై సీతారాం అంటూ నినాదాలు చేశారని వెల్లడించారు. ‘‘రాముడు భారతీయ సంస్కృతికి పర్యాయపదం. మా పూర్వీకులు రాముడి భక్తులు, మేము కూడా అంతే. మన సంప్రదాయాలను, పూర్వీకులను ఎలా మార్చగలం? వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందినందున, ప్రజలు హారతి ఇవ్వడం ద్వారా రాముడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆయన దయవల్లే అంతా జరిగింది’’ అని నజ్నియన్‌ అన్సారీ పేర్కొన్నారు.

రామనవమి.. సంస్కృతిలో భాగం
రామనవమి మన దేశ సంస్కృతిలో ఒక భాగమని విశాల్‌ భారత్‌ సంస్థాన్‌కు చెందిన డాక్టర్‌ నజ్మా పర్వీన్‌ అన్నారు. శ్రీరాముడి దయవల్ల ముస్లిం మహిళలకు మద్దతుగా ట్రిపుల్‌ తలాక్‌ బిల్లు, వక్ఫ్‌ బిల్లు ఆమోదం పొందాయన్నారు. రామ్‌జీ జన్మదిన వేడుకలు జరుపుకోవడం వేల సంవత్సరాల సంప్రదాయమని విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ జాతీయ అధ్యక్షుడు డాక్టర్‌ రాజీవ్‌ అన్నారు.