
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ జామ్‌నగర్ నుంచి చేపట్టిన 170 కిలోమీటర్ల పాదయాత్ర ఆదివారం ద్వారకకు చేరుకోవడంతో ముగిసింది. శ్రీరామనవమి పర్వదినంతోపాటు హిందూ క్యాలెండరు ప్రకారం తన పుట్టినరోజు నాడు అనంత్ ద్వారకాధీశుని సన్నిధికి చేరుకోవడం విశేషం. తల్లి నీతా అంబానీ, భార్య రాధికా మర్చంట్‌లతో కలిసి శ్రీ కృష్ణుడిని దర్శించుకొని పూజలు చేశారు. ఆధ్యాత్మిక అన్వేషణ పేరుతో మార్చి 29న మొదలైన ఈ పాదయాత్ర తొమ్మిది రోజులపాటు కొనసాగింది. కొంతమంది సహాయకులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు యాత్రలో వెంట నడిచారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి అనంత్ మాట్లాడుతూ..‘‘మీ భక్తి మిమ్మల్ని ముందుకు నడిపించనివ్వండి. అది సవినయంగా మిమ్మల్ని తీర్చిదిద్దనివ్వండి. జీవితం భారంగా అనిపించినపుడు మీ విశ్వాసం మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్లనివ్వండి’’ అన్నారు. నీతా అంబానీ స్పందిస్తూ.. తన కుమారుడు 9 రోజుల పాదయాత్రతో ద్వారకకు చేరుకోవడం గర్వంగా ఉందన్నారు. అనంత్‌కు మరింత బలాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.




