
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో మార్చి 30న ఉగాది ఆస్థానాన్ని పురస్కరించుకుని మార్చి 25వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టిటిడి ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది.ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.మార్చి 25న ఉదయం 6 నుండి 11 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, పోటు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుభ్రం చేయనున్నారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మార్చి 25న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ రద్దు చేసింది. 24వ తేది ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడదని టిటిడి ఆ ప్రకటనలో తెలిపింది.




