News

భారత సైన్యం అమ్ములపొదిలోకి మరిన్ని అస్త్రాలు

413views

సాయుధ దళాల ఆధునికీకరణే లక్ష్యంగా ఈ ఏడాదిని.. ‘సంస్కరణల సంవత్సరం’గా ప్రకటించిన రక్షణశాఖ త్రివిధ దళాల బలోపేతానికి కీలక నిర్ణయాలు తీసుకుంది. రక్షణశాఖమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) రూ.54,000 కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులకు ప్రాథమిక ఆమోదం తెలిపింది. ఇందులో టి-90 ట్యాంకుల ఆధునికీకరణతో పాటు.. గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థల కొనుగోళ్లకు సంబంధించిన ప్రతిపాదనలూ ఉన్నాయి. మరోవైపు ప్రధాని మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఎస్‌) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా అభివృద్ధి చేసిన అడ్వాన్స్డ్‌ టోవ్డ్‌ ఆర్టిలరీ గన్‌ సిస్టమ్‌ (అటాగ్స్‌) అనే శతఘ్నులను సైన్యంలో తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.7,000 కోట్ల విలువైన భారీ ఒప్పందానికి ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందం ప్రకారం.. మొత్తం 307 శతఘ్నులను సైన్యం కోసం కేంద్రం కొనుగోలు చేయనుంది. దీంతో పాటు.. 327 గన్‌ టోయింగ్‌ వాహనాలకూ ఆర్డర్‌ ఇవ్వనుంది. అటాగ్స్‌.. దేశీయంగా అభివృద్ధి చేసిన 150 ఎం.ఎం.శతఘ్ని వ్యవస్థ. ఇందులో 52 క్యాలిబర్‌ బ్యారెల్‌ ఉంటుంది. 45 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. ఇందులో 65 శాతం దేశీయంగా తయారుచేసిన పరికరాలనే వినియోగించనున్నారు. ఈ అటాగ్స్‌లను పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లో భారత సైన్యం మోహరించే అవకాశం ఉంది.

డీఏసీ ఆమోదించిన ప్రాజెక్టులివే..

  • రూ.54 వేల కోట్ల విలువైన సైనిక ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా భారతీయ వాయుసేనకు గగనతల ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను కొనుగోలు చేయాలని డీఏసీ నిర్ణయించింది. వీటితో వాయుసేన సామర్థ్యం మరింత పెరగనుంది. వివిధ ఆయుధ వ్యవస్థల పనితీరు కూడా మెరుగుపడనుంది.
  • టి-90 యుద్ధ ట్యాంకుల ఇంజిన్ల ఆధునికీకరణకూ డీఏసీ ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత 1000 హెచ్‌పీ ఇంజిన్ల స్థానంలో ఈ ట్యాంకులకు 1350 హెచ్‌పీ ఇంజిన్లను అమర్చనున్నారు. దీంతో యుద్ధక్షేత్రంలో వీటి కదలికలు మెరుగుపడనున్నాయి. ముఖ్యంగా ఎతైన ప్రాంతాల్లో వీటి సామర్థ్యం పెరగనుంది.
  • భారత నౌకాదళం ప్రతిపాదించిన వరుణాస్త్ర టోర్పిడోలకు కూడా డీఏసీ పచ్చజెండా ఊపింది. శత్రు జలాంతర్గాములను పేల్చివేయడానికి వీటిని ఉపయోగిస్తారు. వీటిని విశాఖపట్నంలోని నేవల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజికల్‌ లేబోరేటరీ అభివృద్ధి చేసింది.