ArticlesNews

స్వాతంత్ర్య పోరాటానికి కృషి చేసిన వీర కిశోరాల షహీద్‌ ‌దివస్‌

311views

( మార్చి 23 – భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ ల షహీద్‌ ‌దివస్‌ )

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఎంతోమంది వీరులు ఉన్నా..వారిలో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్ మాత్రం ప్రత్యేకం. తెల్లవాళ్ల విషపు శృంఖలాల నుంచి భరతమాతను రక్షించడానికి తమ ప్రాణాల్ని సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టడానికి సిద్ధపడిన అమరవీరులు భగత్‌సింగ్‌, ‌సుఖ్‌దేవ్‌, ‌రాజ్‌గురులు. వీరిని 1931 మార్చి 23వ తేదీన లాహోర్‌ ‌సెంట్రల్‌ ‌జైల్లో ఉరి తీశారు. తెల్లదొరల బానిస సంకెళ్ల నుంచి భరతమాతను విడిపించేందుకు వీరు చేసిన త్యాగం చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించి ఉంది. ఈ విప్లవ వీరుల బలిదానానికి చిహ్నంగా మార్చి 23వ తేదీని ‘షహీద్‌ ‌దివస్‌’‌గా అంటే అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా దేశమంతా జరుపుకొంటున్నారు.

అమరవీరులలో ప్రముఖుడుగా పేరొందిన వారిలో షహీద్‌ ‌భగత్‌సింగ్‌. ‌కిషన్‌సింగ్‌, ‌విద్యావతి దంపతులకు 1907 సెప్టెంబర్‌ 27‌వ తేదీన నేటి పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌ ‌దగ్గరలోని ఖత్కర్‌ ‌కలాన్‌ ‌గ్రామంలో భగత్‌సింగ్‌ ‌జన్మించాడు. ‌రౌలత్‌ ‌చట్టానికి వ్యతిరేకంగా ఏప్రిల్‌ 18, 1919‌న అమృత్‌సర్‌లోని జలియన్‌ ‌వాలాబాగ్‌లో జనరల్‌ ‌డయ్యర్‌ ‌నాయకత్వంలో జరిపిన కాల్పులలో వందలాది మంది ప్రజలు మరణించారు. ఈ సంఘటన భగత్‌సింగ్‌ను ఎంతగానో కదిల్చి వేసింది. రాజ్‌గురు 1908 ఆగస్టు 24న పూనా సమీపంలోని భీమా నది ఒడ్డున ఉన్న ఖేద్ అనే గ్రామంలో పార్వతిదేవి, హరినారాయణ దంపతులకు జన్మించాడు. తన 14వ ఏట ఇల్లు వదిలిన రాజ్‌గురు భారత్ సేవా మండల్‌లో చేరాడు. ఆ సమయంలో చంద్రశేఖర్ ఆజాద్‌తో రాజ్‌గురుకు పరిచయం ఏర్పడింది. భగత్‌సింగ్‌కు వెన్నుదన్నుగా నిలిచిన మరో వ్యక్తి సుఖ్‌దేవ్. పూర్తి పేరు సుఖ్‌దేవ్ థాపర్. 1907 మే 15న లూథియానాలో రామ్‌లాల్ థాపర్, రల్లీదేవి దంపతులకు జన్మించాడు. భారతదేశాన్ని బ్రిటీష్ ఆధిపత్య సంకెళ్ల నుంచి విప్పుతానని తన యుక్త వయసులోనే ప్రతిజ్ఞ చేశాడు.

1928లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా లాహోర్‌లో లాలా లజపతి రాయ్ ఆందోళన చేపట్టగా.. బ్రిటీష్ పోలీస్‌అధికారి స్కాట్ జరిపిన లాఠీఛార్జ్‌లో ఆయన తీవ్రంగా గాయపడి ప్రాణాలు వదిలారు. లాలా లజపతి రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతిజ్ఞ బూనిన భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు.. మరో పోలీస్ అధికారి జాన్ సాండర్స్‌ను స్కాట్‌గా పొరబడి అతడిని కాల్చి చంపారు. అలాగే బ్రిటీష్‌ ‌వారి అకృత్యాలను ప్రపంచానికి ఏకరువు పెట్టడానికి ఢిల్లీ అసెంబ్లీలో 1929‌న బాంబు వేయాలని ‌భగత్‌సింగ్‌ ‌బృందం నిర్ణయించారు. అయితే ఇది ఎవరినీ చంపడానికి ఉద్దేశించింది కాదు. అనంతరం పోలీసులకు స్వచ్ఛందంగా లొంగిపోయారు. ఇందుకు వారిని అరెస్ట్ చేసి లాహోర్‌ ‌సెంట్రల్‌ ‌జైల్లో ఉంచారు.

భగత్‌సింగ్‌ బృందం ‌వేసిన బాంబు కూడా పరిశోధించి అది పొగబాంబని తేల్చారు. కానీ సాండర్స్‌ను చంపిన హత్య కేసులో భగత్‌సింగ్‌, ‌సుఖ్‌ ‌దేవ్‌, ‌రాజ్‌గురులకు ఉరిశిక్షను విధించారు. కానీ వారు ఉరిశిక్షకు జంకలేదు. వారిని ఉరి తీయకూడదని వారి ‌తల్లి దండ్రులే కాదు దేశమంతా కోరుకున్నారు. దేశమంతా భగత్‌సింగ్‌, ‌సుఖ్‌ ‌దేవ్‌, ‌రాజ్‌గురుల ఉరిశిక్షకు వ్యతిరేకంగా ప్రదర్శనలు జరుగుతుండంతో బ్రిటీష్‌ అధికారులు భయపడ్డారు.దీంతో ఒకరోజు ముందుగానే అంటే మార్చి 23, 1931వ తేదీన నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 7.15 నిమిషాలకు ఉరితీశారు. ముగ్గురు మిత్రులు ఉరితాడును ముద్దాడుతూ ‘ఇంక్విలాబ్‌ ‌జిందాబాద్‌!’ అం‌టూ భరతమాత చెంత చేరారు.

బ్రిటీష్‌ అధికారులు మృత దేహాలను లేకుండా చేయాలనుకొన్నారు. సట్లెజ్‌ ‌నదీ తీరంలోని హుస్సేనీ వాలాలో అంతిమ సంస్కారాలు జరపకుండానే దహనం చేశారు. అది చూసిన కొందరు నదిలో దూకి, వాటిని సేకరించి అంతిమ సంస్కారాలు చేసి వారి సంస్మరణార్ధం అక్కడే అమర వీరుల స్మారక చిహ్నాన్ని కట్టారు. తల్లి భారతికి స్వేచ్ఛనందించి, తమ రుణం తీర్చుకునే ఏకైక లక్ష్యంతో జీవితాలను పణంగా పెట్టిన వీర కిశోరాలు భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు జాతి యావత్తూ రుణ పడి ఉంటుంది.